అమెరికా-ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతోంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వరస పోస్టులు పెట్టారు.
మేం కొత్త మార్పు దిశగా ముందుకెళ్తున్నాం. మా నౌకల్ని అత్యుత్తమ ఆయుధాలతో లోడ్ చేస్తున్నాం. గతంలో ఉపయోగించిన వాటికంటే ఇవి శక్తివంతమైనవి. అంతర్జాతీయ జలమార్గాలని ఉపయోగించి ప్రపంచాన్ని కొన్నిరోజులు దోపిడి చేయడం తప్ప ఇరాన్ నేతలకు మరో దారి లేదు. కేవలం చర్చలు జరపడానికి మాత్రమే వాళ్లు బతికున్నారు అని ట్రంప్ వరస పోస్టులు పెట్టారు.
ఇదంతా చూస్తుంటే ఒకవేళ ఇరాన్‌తో చర్చలు గనక విఫలమైతే భారీ సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని సంకేతాలు ఇస్తున్నట్లే. ఇప్పుడీ వ్యాఖ్యలే అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలకు ఏర్పాట్లు పూర్తయిన వేళ ఇరాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
లెబనాన్‌లో కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల విడుదల ముందు జరగాలని.. ఈ రెండు షరతులు నెరవేరే వరకు చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అన్నారు. ఇప్పటికే వీటిపై ఇరుపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరినా, ఇంకా అమలు కాలేదని గుర్తుచేశారు. చర్చలు ప్రారంభమయ్యే ముందు ఈ రెండు పూర్తి కావాల్సిందేని స్పష్టం చేశారు.


