
అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో తీవ్రస్థాయి పరస్పర విమర్శలు గుప్పించుకున్న ట్రంప్-మస్క్.. మళ్లీ ఒక్కటయ్యారు!. అరిజోనా స్టేట్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ వెనుక కూర్చుని ఇద్దరూ తెగ ముచ్చటించుకున్నారు. అంటే.. పొరపచ్చాలను పక్కన పెట్టి అమెరికా కోసం మళ్లా ఒక్కటిగా కలిసి పని చేయబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది.
కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్‌ను అమెరికా స్వాతంత్ర సమర యోధుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కిర్క్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం అరిజోనా స్టేట్ గ్లెన్‌డేల్ నగరంలోని స్టేట్ ఫామ్ స్టేడియంలో నిర్వహించిన కిర్క్ స్మారక సభలో ట్రంప్ పై ప్రకటన చేశారు. అయితే..
ఇదే వేదికగా కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ట్రంప్‌తో కరచలనం చేసి.. పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం మస్క్‌ను టచ్ చేస్తూ ఆప్యాయంగానే మాట్లాడారు. ఆ సమయంలో మస్క్ తన చేతులను ‘‘పిరమిడ్ హ్యాండ్ సింబల్’’ రూపంలో ఉంచడమూ.. ఇంటర్నెట్‌ను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
NEW: President Trump and Elon Musk were spotted sitting together and chatting during a surprise reunion at Charlie Kirk’s memorial. pic.twitter.com/5asd3mTiJF
— Fox News (@FoxNews) September 21, 2025
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్‌ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్‌కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు..
ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్‌నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు.. మస్క్‌ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్‌ను ఇరకాటంలో పడేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
అయితే, కొన్నాళ్లుగా మస్క్ స్వరం మారింది. ట్రంప్‌లాగే చార్లీ కిర్క్‌తో ఎలాన్ మస్క్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన స్మారక సభలో మస్క్ భావోద్వేగంగా స్పందించారు. అదే సమయంలో ట్రంప్‌తో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత విభేదాలను పక్కనబెట్టి, మళ్లీ కలిసి పనిచేయబోతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. దీనికి మస్క్ ఎక్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.