ఒబామాను అరెస్టు చేయాలి: ట్రంప్ | Trump calls for Obamas arrest | Sakshi
Sakshi News home page

ఒబామాను అరెస్టు చేయాలి: ట్రంప్

May 13 2026 2:29 AM | Updated on May 13 2026 3:53 AM

Trump calls for Obamas arrest

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పరోక్ష పిలుపునిచ్చారు. 2016 ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై జరిగిన దర్యాప్తును ఒక ‘కుట్ర’గా అభివర్ణిస్తూ, ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టును ట్రంప్ రీ-షేర్ చేశారు.

2016లో తన ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీసేందుకు ఒబామా నేతృత్వంలోని యంత్రాంగం కల్పిత ఇంటెలిజెన్స్ సమాచారంతో ‘మోసపూరిత’ దర్యాప్తుకు తెరలేపిందని సదరు పోస్టులో పేర్కొన్నారు.రష్యా దర్యాప్తును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణంగా ట్రంప్ పదేపదే అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలను వెల్లడించినందుకు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను ఆయన ప్రశంసించారు.

కాగా ట్రంప్ చర్యను డెమొక్రాట్లు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఒబామా తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఇవన్నీ కేవలం ‘కుట్ర సిద్ధాంతాలే’నని కొట్టిపారేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు ఈ పోస్టును స్వాగతించారు. ‘డీప్ స్టేట్’ అవినీతిని అంతం చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని చూస్తున్నారు. దీని ప్రభావంతో సోషల్ మీడియాలో #ArrestObama అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలు అమెరికా రాజకీయాల్లో నెలకొన్న లోతైన విభజనను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement