ట్రంప్‌ ప్లాన్‌తో పాక్‌ పాస్‌పోర్ట్‌ చెల్లదా? | Trump Abraham Accords Push May Force Pakistan To Rewrite Its Passport | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్లాన్‌తో పాక్‌ పాస్‌పోర్ట్‌ చెల్లదా?

May 27 2026 7:14 AM | Updated on May 27 2026 7:21 AM

Trump Abraham Accords Push May Force Pakistan To Rewrite Its Passport

“ఈ పాస్‌పోర్ట్‌ ఇజ్రాయెల్‌కు చెల్లదు”.. అని పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్‌ తన పాస్‌పోర్ట్‌ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది.

ట్రంప్‌ తాజాగా “అబ్రహామ్‌ అకార్డ్స్‌” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్‌, టర్కీతో పాటు పాకిస్థాన్‌ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు.  మిడిల్‌ ఈస్ట్‌లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్‌లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.

అయితే పాకిస్థాన్‌ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్‌పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్‌ దార్‌ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్‌ చెబుతోంది.

అబ్రహం అకార్డ్స్‌
అబ్రహం అకార్డ్స్‌.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్‌–అరబ్‌ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, మొరాకో వంటి దేశాలు ఇందులో చేరి ఇజ్రాయెల్‌తో నేరుగా దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. విమాన సర్వీసులు, టూరిజం, వ్యాపారం, సాంకేతిక సహకారం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. అయితే.. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకముందే అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలపడం వల్ల ఇవి మిడిల్‌ ఈస్ట్‌ పాలిటిక్స్‌లో చారిత్రక మలుపుగా భావించబడ్డాయి.

నిబంధనల దాకా..
ఇక్కడే పాకిస్థాన్‌కు పెద్ద చిక్కు ఎదురవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై స్పష్టంగా ఇజ్రాయెల్‌కు మినహాయింపు(Israel excepted) అనే నిబంధన ఉంది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్‌పోర్ట్‌ చెల్లుబాటు అవుతుందిగానీ… ఇజ్రాయెల్‌కు మాత్రం కాదు. ఒకవేళ పాకిస్థాన్‌ ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు ఏర్పరచుకుంటే… అదే సమయంలో తమ పౌరులు అక్కడికి వెళ్లకూడదని చెప్పే పాస్‌పోర్ట్‌ కొనసాగించడం చట్టపరంగా విరుద్ధంగా మారుతుంది. దౌత్య సంబంధాలు, వీసాలు, ట్రేడ్‌, ఎంబసీ వ్యవస్థ అన్నీ అమల్లోకి రావాలంటే ఈ నిబంధనను తొలగించాల్సిందే.

ఇలాంటి పరిణామం ఇప్పటికే బంగ్లాదేశ్‌లో జరిగింది. ఆధునిక ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టే సమయంలో “except Israel” అనే వాక్యాన్ని అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు పాకిస్థాన్‌ విషయంలో కూడా అదే ప్రశ్న ముందుకొస్తోంది. అందుకే… ట్రంప్‌ ప్రతిపాదన కేవలం విదేశాంగ రాజకీయాల మార్పు మాత్రమే కాదు… పాకిస్థాన్‌ జాతీయ గుర్తింపులో భాగమైన పాస్‌పోర్ట్‌ నిబంధనల వరకూ వెళ్లే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాక్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతర్‌, టర్కీ వంటి దేశాలు కూడా చేరాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి, ఆర్థిక భాగస్వామ్యం, ఇజ్రాయెల్‌తో సహకారం కోసం ఈ ఒప్పందాల్లో చేరడం అవసరమని ట్రంప్‌ భావిస్తున్నారు.

ఏయే దేశాలంటే.. 
ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌లలో సాధారణంగా.. “ఈ పాస్‌పోర్ట్‌ ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది” అనే వాక్యం కనిపిస్తుంది. కానీ పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై మాత్రం దశాబ్దాలుగా .. “ఇజ్రాయెల్‌కు మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్‌పోర్ట్‌ చెల్లుతుంది” అనే వాక్యం ముద్రించబడుతోంది. పాకిస్థాన్‌ ఈ నిబంధనను ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి. 

1947లో భారత విభజన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది, అంటే 1948లో ఇజ్రాయెల్‌ దేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచే పాలస్తీనా భూభాగాలపై వివాదం మొదలైంది. పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌… ఇజ్రాయెల్‌ను అధికారిక దేశంగా గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగానే పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌లపై “ఇజ్రాయెల్‌కు చెల్లదు” అనే నిబంధనను ముద్రించడం ప్రారంభించింది. 1950ల చివరి దశ నుంచి 1960ల నాటికి ఈ వాక్యం అధికారికంగా పాస్‌పోర్ట్‌లలో స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇది కేవలం పాకిస్థాన్‌కే పరిమితమైన విషయం కాదు. 

ఒకప్పుడు అనేక ముస్లిం దేశాలు ఇలాంటి విధానాలనే పాటించాయి. అరబ్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన దేశాలు తమ పౌరులు అక్కడికి వెళ్లకుండా పాస్‌పోర్ట్‌లపైనే నిషేధాలను ముద్రించేవి. బంగ్లాదేశ్‌, మలేషియా, బ్రూనై, ఇరాన్‌, సిరియా, లెబనాన్‌, కువైట్‌ వంటి దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. కాలక్రమేణా ప్రపంచ రాజకీయాలు మారాయి. అనేక దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకున్నాయి. దీంతో కొన్ని దేశాలు పాస్‌పోర్ట్‌లలోని ఆ నిబంధనలను తొలగించాయి. 

బంగ్లాదేశ్‌ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అక్కడ కూడా చాలాకాలం పాటు “ఇజ్రాయెల్‌కు మినహా” అనే వాక్యం ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టేటప్పుడు ఆ వాక్యాన్ని తొలగించారు. అయితే ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించలేదనే తమ వైఖరి మాత్రం మారలేదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా పాకిస్థాన్‌, ఇరాన్‌ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్‌ స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే… పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా లభించే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని. 

బంగ్లా బాటలో వెళ్తే.. 
మొదటిగా పాస్‌పోర్ట్‌లను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న “ఇజ్రాయెల్‌కు మినహా” అనే నిబంధనను తొలగించాలంటే కొత్త నమూనా పాస్‌పోర్ట్‌లు ముద్రించాలి. లక్షలాది పాస్‌పోర్ట్‌లను దశలవారీగా మార్చాల్సి రావచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో వీసా విధానాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు, విమాన సర్వీసులు, రాయబార కార్యాలయాల ఏర్పాట్లు వంటి అనేక వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య అధికారిక ప్రయాణాలు ప్రారంభమైతే చట్టపరమైన మార్పులు కూడా తప్పవు.

అయితే అసలు భారమంతా రాజకీయంగానే ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్థాన్‌లో పాలస్తీనా అంశం భావోద్వేగానికి సంబంధించినది. ఇజ్రాయెల్‌ను గుర్తించడం అంటే “దశాబ్దాల వైఖరికి విరుద్ధం” అని మతపరమైన, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా మతపరమైన పార్టీలు, కఠినవాద సంస్థలు దీన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చవచ్చు. మరోవైపు సైన్యం, విదేశాంగ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్‌ లాంటి దేశాలతో సంబంధాలపై కూడా దాని ప్రభావం పడొచ్చు.

ఇక మద్దతుదారులు మాత్రం వేరే వాదన చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పడితే సాంకేతికత, వ్యవసాయం, భద్రత, వాణిజ్య రంగాల్లో లాభాలు రావచ్చని అంటున్నారు. మధ్యప్రాచ్య దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే… ఇది కేవలం పాస్‌పోర్ట్‌పై ఒక లైన్‌ మార్చడం కాదు. పాకిస్థాన్‌ దశాబ్దాల రాజకీయ సిద్ధాంతాన్ని మార్చే నిర్ణయంగా మారే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement