బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాంగ్జి ప్రావిన్స్‌లోని క్విన్‌యువాన్ కౌంటీలో ఉన్న లియుòÙన్యు బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగానే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గనిలో 247 మంది వరకు కార్మీకులున్నారన్నారు.
ఇప్పటి వరకు 201 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు జిన్ పింగ్ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ, సహాయక చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా, చైనాలో తవ్వే బొగ్గులో మూడో వంతు షాంగ్జి ప్రావిన్స్‌లోని గనుల నుంచే లభిస్తుంది.
భారీ ప్రమాదాల చరిత్ర
చైనాలోని గనుల్లో భారీ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 2023లో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఓ గని కుప్పకూలి 53 మంది సజీవ సమాధి అయ్యారు. 2009లో హెయిలొంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లో గ్యాస్ పేలుడుతో 108 గని కార్మీకులు మృతి చెందారు. 2005లో ఇదే ప్రావిన్స్‌లోని మరో గనిలో పేలుడుతో 171 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లోనే లియావోనింగ్ ప్రావిన్స్‌లోని సుంజియావన్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా 214 మంది అసువులు బాశారు. 2004లో షాంగ్జి ప్రావిన్స్‌లోని చెంజియాషన్ గనిలో పేలుడుతో 166 మంది, హెనాన్ ప్రావిన్స్‌లోని డాపింగ్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా మరో 148 మంది చనిపోయారు.2000లో గుయిఝౌ ప్రావిన్స్ లోని ముచోంగౌ గనిలో పేలుడుతో 162 మంది కార్మీకులు మృతి చెందారు.


