ఇంటి అద్దెలు భరించలేక ఆగ్రహం కట్టలు తెంచుకుని.. | Thousands in Spains capital protest increasing housing costs | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దెలు భరించలేక ఆగ్రహం కట్టలు తెంచుకుని..

May 24 2026 5:57 PM | Updated on May 24 2026 5:59 PM

Thousands in Spains capital protest increasing housing costs

మాడ్రిడ్: మన దేశంలోని పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతెందుకు హైదరాబాద్‌లో అద్దెకు ఉండి ఉద్యోగాలు చేసుకునే చాలా మంది .. తమ జీతం అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుందంటూ వాపోతుంటారు. అయితే, అద్దెల బాధల వల్ల వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వార్తను ఎప్పుడైనా విన్నారా? స్పెయిన్‌లో ఆదివారం అదే జరిగింది.

మాడ్రిడ్, బార్సెలోనా లాంటి నగరాల్లో పెరుగుతున్న  ఇంటి అద్దె ఖర్చులు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు, కొంత డబ్బు కూడబెట్టుకున్న వారు ఇళ్లు కొందామన్నా అందుబాటు ధరల్లో ఉండడం లేదని నిరసనకారులు చెప్పారు. స్పెయిన్ ప్రజలను ఇళ్ల మార్కెట్‌కు దూరం చేస్తున్నాయంటూ మాడ్రిడ్‌లో నిరసన చేపట్టారు.

స్పెయిన్‌లో హౌసింగ్‌ క్రిసిస్‌, సోషలిస్టు ప్రధాని పెర్డో సాంచెజ్‌కు తలనొప్పిగా మారింది. 2027 ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద సవాలు. ఆ దేశంలో సొంత ఇల్లు ఉండాలన్న సంప్రదాయం బలంగా ఉంది. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా కారణంగా డిమాండ్ పెరగడంతో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

నిరసనకారులు నినాదాలు చేస్తూ ఇంటి హక్కును గుర్తు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. “మాకు పర్యాటకులు కాదు, నేబర్స్‌ కావాలి” అని ఒక బ్యానర్‌లో రాసి ఉంది.

ఓ ర్యాలీని మరవకముందే మరొకటి
స్పెయిన్‌లో శనివారం కూడా ఓ ర్యాలీ జరిగింది. సాంచెజ్‌కు వ్యతిరేకంగా మాడ్రిడ్‌లో వేలాది మంది నిరసన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అసంతృప్తితో రాజకీయ ఉద్రిక్తతలు, విమర్శలు పెరిగాయి. దీంతో స్పెయిన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

ఆ ర్యాలీ మరవకముందే ఆదివారం మరో ర్యాలీ జరగడం గమనార్హం. స్పెయిన్‌లో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది. మార్కెట్ ఒత్తిళ్లు, ఊహాగానాలు ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలు, తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.

గత నెలలో స్పెయిన్ ప్రభుత్వం 7 బిలియన్ యూరోల ($8.23 బిలియన్) విలువైన భారీ ప్రణాళికను ఆమోదించింది. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలు, ఇళ్ల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.

గత కొన్ని ఏళ్లుగా స్పెయిన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక నిరసనల్లో పాల్గొంటున్నారు. అధిక అద్దెలు, ఇళ్ల ధరలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 97 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు. 

నగర కేంద్రాల్లో విస్తరించిన పర్యాటక అద్దె ఇళ్లపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది. 2025 చివర్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెరిగాయని యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌ అంచనా ప్రకారం.. 50 మిలియన్ జనాభా ఉన్న స్పెయిన్‌లో 7,00,000 ఇళ్ల కొరత ఉంది. డిమాండ్‌తో పోల్చితే కొత్త నిర్మాణాల వేగం తక్కువగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement