britan person wakes ear long in coma unaware of corona pandemic - Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ముందే కోమాలోకి : రెండు సార్లు కరోనా

Published Mon, Feb 8 2021 4:31 PM

Teen Wakes Up ear Long Coma Unaware Of Corona Pandemic - Sakshi

ఇంగ్లాండ్: గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్‌డౌన్‌ కష్టాలు ఇవేవీ తెలియకుండానే సంవత్సరం పాటు గడిపేశాడు బ్రిటన్‌కు చెందిన ఒక యువకుడు.  తన దేశంలో 110,000 మందికి పైగా మరణాలు, దాదాపు నాలుగు మిలియన్ల కేసులతో కోవిడ్‌-19 సృష్టించిన విలయం...ఇవేవీ అతగాడికి నిజంగా తెలియదు. ఎందుకంటే, లాక్‌డౌన్‌కు మూడువారాల ముందు స్టేజ్‌-2 కోమాలోకి జారుకున్న అతగాడు ఇపుడిపుడే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. అంతేకాదు ఈ కాలంలో తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాడు. రెండుసార్లు కరోనా వైరస్‌ బారిన పడ్డాడు కూడా. చివరకు కోమా నుంచి బైటపడి క్రమంగా కోలుకుంటూ ఉండటం విశేషం. 

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన జోసెఫ్ ఫ్లావిల్  (19) గత ఏడాది మార్చి 1న బర్టన్-ఆన్-ట్రెంట్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.  కారు అతడ్ని బలంగా ఢీకొట్టడంతో మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో జోసెఫ్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఇంతలో దేశలో కరోనా మహమ్మారి విస్తరించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు సహా ఎవరినీ ఆసుపత్రి అనుమతించలేదు. కేవలం వీడియోల ద్వారా అతనితో కమ్యూనికేట్ చేస్తూ, ధైర్యం చెప్పారు.  అలా ఏడాదిపైగా ఆసుపత్రిలో ఒంటరి పోరాటం చేసి జోసెఫ్‌ మెల్లగా కోటుకుంటూ ఉండటంతో బంధువులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. జోసెఫ్ ప్రస్తుతం సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లోని ఒక సంరక్షణా కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు వైద్య ఖర్చుల నిమిత్తం నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కుటుంబ సభ్యులు

కాగా, జోసెఫ్ కోమా నుంచితేరుకుని బయటపడి మెల్లగా కోలుకుంటున్నాడని, ఇది తమకెంతో ఆనందాన్ని కలిగించిందని సమీప బంధువు సాలీ ఫ్లావిల్ తెలిపారు. తమ మాటల్ని వినగలుగుతున్నాడని, తమ సైగలను అర్థం చేసుకుంటూ కళ్లతోనే ప్రతిస్పందిస్తున్నాడని ఆమె తెలిపారు. అయితే జోసెఫ్‌ తిరిగి సాధారణ స్థితికిరావడానికి మాత్రం ఇంకా చాలా టైం పడుతుందన్నారు. కాగా మంచి క్రీడాకారుడైన జోసెఫ్ హాకీ, కౌంటీ క్రికెట్, స్కైడ్‌, సర్పింగ్‌లో‌ ప్రావీణ్యుడు. ఈ నేపథ్యంలో మే 2020 లో బకింగ్‌హామ్ ప్యాలెస్ ‘గోల్డ్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్’ అవార్డును అందుకోవలసి ఉంది. కానీ ప్రమాదం కారణంగా అందుకోలేకపోయాడు.. 

Advertisement
Advertisement