
మధ్యంతర ప్రభుత్వ అధినేతగా నియమించాలని యువత సూచన
రోజురోజుకీ పెరుగుతున్న మద్దతు
మరికొన్ని పేర్లు సైతం తెరపైకి..
కాఠ్మండు: కల్లోల నేపాల్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్‌లైన్‌లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది.
మద్దతుగా 2,500 మంది సంతకాలు
మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్‌లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌ను, అనంతరం అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.
ఎవరీ జస్టిస్ సుశీల?
నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్‌గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.
అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్‌గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్‌డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.

మోదీజీ కో నమస్కార్
నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు.
భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు.