ప్రజాస్వామ్యంపై దారుణ దాడి

Structures of democracy under brutal attack in India says Rahul Gandhi - Sakshi

లండన్‌లో కార్యక్రమంలో మోదీ సర్కార్‌పై రాహుల్‌ ఆరోపణ

లండన్‌: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్‌.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్‌ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు.

‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్‌ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్‌ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి.

నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్‌ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్‌ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని  ఆరోపించారు.  

ప్రతిష్ట దిగజార్చింది ఆయనే
విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్‌ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్‌ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్‌ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top