
16 మంది మృతి, 21 మందికి గాయాలు
లిస్బన్: పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లోని ప్రముఖ పర్యాటక విశేషం ‘గ్లోరియా ఫునిక్యులర్’స్ట్రీట్ కార్ ఘోర ప్రమాదానికి గురైంది. ఒక బోగీ అదుపుతప్పి కిందు దూసుకొచ్చి పక్కనున్న భవనాన్ని ఢీకొనడంతో 16 మంది చనిపోయారు. 21 మంది గాయపడ్డారు. 140 ఏళ్లుగా నిర్వహించే ఈ స్ట్రీట్ కార్‌లోని రెండు బోగీలుంటాయి. విద్యుత్ మోటార్లతో బోగీలు కేబుల్‌తో అనుసంధానించి ఉంటాయి.
ఇందులో ఒకటి పైకి వెళ్తుంటే, మరోటి కింది వస్తుంటుంది. ప్రయాణ సమయం మూడే మూడు నిమిషాలు. ప్రయాణ దూరం 265 మీటర్లు. పర్వత శిఖరం పైనుంచి కిందకు మెలికలు తిరుగుతూ వెళ్లివచ్చే కేబుల్ కారులో ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు. ఒక్కో బోగీలో 41 మందే ప్రయాణించే వీలుంటుంది. బుధవారం కిందికి వచ్చే బోగీ అదుపు తప్పి పక్కనుండే భవనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది.
ఆ తీవ్రతకు బోగీ మొత్తం నామరూపాల్లేకుండా నుజ్జయింది. దీంతో, అందులోని 16 మంది చనిపోయారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విష మంగా ఉందని చెబుతున్నారు. బ్రేక్ పనిచేయకపోవడం లేదా కేబుల్ తెగిపోవడం వల్ల ప్రమాదం ఘటన జరిగి ఉండొచ్చన్న వార్తలపై అధికారులు స్పందించలేదు. మృతుల్లో పోర్చుగల్ వారితోపాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మొరాకో, దక్షిణ కొరియా, కేప్‌వెర్డె తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. స్థానికంగా ‘ఎల్వడోర్ డా గ్లోరియా’ అని పిలుచుకునే ఈ స్ట్రీట్ కారుకు విదేశాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఇలా పలు దేశాల నుంచి పర్యాటకులు ఏటా వస్తుంటారు. ఘటన నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.