ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్‌ పునఃప్రారంభం..? | Strait of Hormuz to reopen soon | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్‌ పునఃప్రారంభం..?

May 26 2026 12:00 AM | Updated on May 26 2026 12:07 AM

Strait of Hormuz to reopen soon

ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ‍ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్‌ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్‌లో  ప్రపంచ దేశాల నౌకలు  ఎటువంటి ఆటంకం లేకుండా  ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.

హర్ముజ్‌లో ఇరాన్‌ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఇటీవల ఇరాన్‌ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement