ఇజ్రాయెలీ నగరం డిమోనాలో 30 శాతం భారత సంతతి వారే
ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్‌లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది.
వారి సంతతి ముంబై, నవ్‌గావ్, పుణె, అహ్మదాబాద్‌ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.
భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్‌పాప్డీ, గులాబ్‌జాం, పాప్డీ చాట్, భేల్‌పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్‌లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్‌లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్‌లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది!
– సాక్షి, నేషనల్ డెస్క్


