Little India
-
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్‌లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్‌గావ్, పుణె, అహ్మదాబాద్‌ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్‌పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్‌లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్‌లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్‌లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
164 ఏళ్ల హిందూ ఆలయ పునరుద్ధరణ
సింగపూర్ : లిటిల్ ఇండియాలోని పురాతన హిందూ ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 164 ఏళ్ల క్రితం నిర్మితమైన శ్రీ శ్రీనివాస పెరుమాల్ దేవాలయాన్ని ఆధునీకరించడానికి 20 మందితో కూడిన కళాకారుల(శిల్పుల) బృందం ఏడాది కాలంగా పనిచేస్తోంది. ఇందుకోసం 20 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ‘పనులు జరుగుతున్నప్పటికీ ప్రతి రోజూ పూజ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పండుగల సందర్భంలో మాత్రం నిర్మాణ పనులకు విరామం ఇస్తున్నాం. భక్తుల పూజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరిపడ స్థలం ఉండేలా, పాత పెయింటింగ్‌లను రీపెయింటింగ్ చేయడం, రాజగోపురాన్ని యథాస్థానానికి తీసుకురావడం, ఆచారాలకు, పద్దతులకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి’ అని ఆలయ అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ఏప్రిల్ 22వ తేదీన 39 మంది పండితులతో ఘనంగా ఆలయ పునరుద్ధరణ వేడుకలు జరపనున్నట్టు తెలుస్తోంది. 1978లోనే ప్రిజర్వేషన్ బోర్డ్ ఆఫ్ సింగపూర్ ఈ ఆలయాన్ని జాతీయ స్మారకంగా గుర్తించింది. ఆ తరువాత 1979,1992, 2005లలో మూడుసార్లు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హిందూ ఆలయాల పునరుద్ధరణ, పున:నిర్మాణ పనులను సింగపూర్ ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగా నాలుగోసారి శ్రీ శ్రీనివాస పెరుమాల్ ఆలయ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. -
సింగపూర్‌లో భారతీయుడి మృతి, చెలరేగిన హింస
సింగపూర్: సింగపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు మృతి చెందడంతో దాదాపు 400 మందిపైగా దక్షిణాసియా వలస కార్మికులు చేపట్టిన ఆందోళన హింసకు దారి తీసింది. లిటిల్ ఇండియాలో ఈ ఘర్షణలు చోటుచుకున్నాయి. శక్తివేల్ కుమారవేలు(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘర్షణలు రేగాయి. స్థానిక హెంగ్ హప్ పూన్ కంపెనీలో రెండేళ్లుగా పనిచేస్తున్న శక్తివేల్‌ను ఆదివారం సాయంత్రం టెక్కా సెంటర్ సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. దీంతో దక్షిణాసియా వలస కార్మికులు ఆందోళనకు దిగారు. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఐదు పోలీసు వాహనాలు, పలు ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో 10 మంది పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే తాము కాల్పులు జరపలేదని పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని లీ హైసన్ లాంగ్ ఆదేశించారు.


