అద్వితీయ క్షిపణిని పరీక్షించిన రష్యా  | Russia tests nuclear-powered Burevestnik missile | Sakshi
Sakshi News home page

అద్వితీయ క్షిపణిని పరీక్షించిన రష్యా 

Oct 27 2025 2:06 AM | Updated on Oct 27 2025 2:06 AM

Russia tests nuclear-powered Burevestnik missile

అణు ఇంజిన్‌తో పనిచేసే క్రూయిజ్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్‌

మాస్కో: అపరిమితమైన దూరంలోని లక్ష్యాన్ని సైతం చేధించే అద్వితీయ క్షిపణి ‘బురేవేస్ట్‌నిక్‌’ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదివారం ప్రకటించారు. అణుఇంజిన్‌ అందించే అసాధారణ శక్తితో ఇది గంటల తరబడి గాల్లో ప్రయాణించగలదు. ఆదివారంనాటి పరీక్షలో ఇది ఏకధాటిగా 15 గంటలపాటు గాల్లోనే దూసుకెళ్లిందని దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పుతిన్‌ ప్రకటించారు. 

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో వర్చువల్‌ భేటీలో పుతిన్‌ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం. తక్కువ ఎత్తులో అపరిమిత దూరాలకు ప్రయాణించే ఈ క్షిపణిని తయారుచేయబోతున్నట్లు 2018లో రష్యా తొలిసారిగా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి సమర్థతపై పశ్చిమదేశాలు అనుమానం వ్యక్తంచేశాయి. రెండేళ్ల క్రితమే పూర్తిస్థాయి క్షిపణిని తయారుచేశామని పుతిన్‌ చెప్పారు. 

అయితే 2016 ఏడాది నుంచి ఇప్పటిదాకా 13 సార్లు ఈ క్షిపణిని పరీక్షించగా రెండుసార్లు మాత్రమే పాక్షికస్థాయిలో లక్ష్యాన్ని చేధించిందని ఒక నిరాయు«దీకరణ ఉద్యమ సంస్థ పేర్కొంది. న్యూక్లియర్‌ ప్రొపల్షన్‌ యూనిట్‌ను తయారుచేయడం చాలా కష్టమైన వ్యవహారమని ఇంటర్నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ సంస్థ అభిప్రాయపడింది. అయితే తమ క్షిపణి 10వేల నుంచి 20వేల కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఆర్మీ చెబుతోంది. 

భూమి నుంచి కేవలం 50 లేదా 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండటం కారణంగా ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ఈ మిస్సైల్‌ రాకను గుర్తించలేవు. గాల్లో ఘన ఇంధన రాకెట్‌ బూస్టర్ల సాయంతో ప్రయోగించాక ఇది ప్రయాణాన్ని అణు ఇంజిన్‌తో కొనసాగిస్తుందని నాటో వర్గాలు అంచనావేస్తున్నాయి. దీనికి స్కైఫాల్‌ అని పేరుపెట్టుకున్నాయి. 

ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించిన జాయింట్‌ స్టాఫ్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ కేంద్రాన్ని సా యుధ బలగాల సుప్రీం కమాండర్‌ హోదాలో పుతిన్‌ పుతిన్‌ ఆదివారం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. చీఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్‌ వలేరీ గెరసిమోవ్‌ సారథ్యంలోని కమాండర్లతో పుతిన్‌ భేటీ అయ్యారు. కీలకమైన మార్గాల్లో 10,000 మందికిపైగా ఉక్రెయిన్‌ సైన్యాన్ని చుట్టుముట్టామని వలేరీ పుతిన్‌కు వివరించారు. ఏకంగా 31 బెటాలియన్ల ఉక్రెయిన్‌ సైన్యాన్ని చుట్టుముట్టామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement