
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని కేబినెట్ బిల్డింగ్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉక్రెయిన్ దేశంపై రష్యా 805 డ్రోన్లతో దాడులు జరిపింది. వీటిలో పదుల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు ఉక్రెయిన్ కేబినెట్ బిల్డింగ్‌పై దాడి చేశాయి. బిల్డింగ్‌పై మొదట దట్టమైన పొగ కమ్ముకుంది. తేరుకునే లోపే కేబినెట్ బిల్డింగ్‌పై రష్యా ఆర్మీ.. డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. ఫలితంగా సగానికిపై కేబినెట్ బిల్డింగ్ ధ్వంసమైంది.
అయితే,రష్యా దాడిని ఉక్రెయిన్ బలగాలు తిప్పికొట్టాయి. 747 డ్రోన్లు,నాలుగు మిస్సైళ్లను నిర్విర్యం చేశామని ఉక్రెయిన్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ తైమూర్ టకాచెంకో తెలిపారు. ఇక, తొమ్మిది మిస్సైళ్లు, 56 డ్రోన్ దాడులు దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో దాడులు జరిపాయి. ఎనిమిది ప్రాంతాల్లో కూలిన డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు పడ్డాయి.
రష్యా ప్రధాన చమురు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి
రష్యా భారీ ఎత్తున దాడులకు తెగబడటానికి ఉక్రెయిన్ కారణమని తెలుస్తోంది. హంగేరీ, స్లోవాకియా దేశాలకు రష్యా తన ప్రధాన చమురు కేంద్రమైన డ్రుఝ్బా (Druzhba) నుంచి చమురు సరఫరా చేస్తోంది. ఇటీవల, రష్యాలోని బ్రయాన్స్ ప్రాంతం ఉనేచా నగరంలో డ్రుఝ్బా (Druzhba) ఆయిల్ పైప్‌లైన్‌పై ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దళాలు ‘కామికాజే డ్రోన్స్’ ఉపయోగించి డ్రుఝ్బా బూస్టర్ పంప్ స్టేషన్, ట్యాంక్ ఫార్మ్, ప్రధాన పంప్ విభాగాల్ని పేల్చివేసింది. రష్యా తమ దేశంపై కొనసాగిస్తున్న యుద్ధ ప్రయత్నాలు నిలువరించేందుకు ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఉనేచా చమురు కేంద్రం నుంచి స్టేషన్ ద్వారా సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల ముడి చమురు రవాణా జరుగుతుంది.