
ఉక్రెయిన్ వ్యాప్తంగా దాడులు.. ముగ్గురు మృతి
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీ దాడులకు తెరతీసింది. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో ముగ్గురు చనిపోగా డజన్లకొద్దీ జనం గాయపడ్డారు. రష్యా 579 డ్రోన్లు, 8 బాలిస్టిక్ మిస్సైళ్లు, 32 క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించగా 552 డ్రోన్లను, రెండు బాలిస్టిక్ క్షిపణులను, 29 క్రూయిజ్ మిస్సైళ్లను కూ ల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిప్రోపెట్రోవిస్క్, మైకోలైవ్, చెర్నిహివ్, జపొరిఝియా, పొల్టావా, కీవ్, ఒడెసా, సుమీ, ఖార్కివ్.. మొత్తం 9 ప్రాంతాల్లోని మౌలికవసతులు, నివాస ప్రాంతాలు, సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పౌరులను రెచ్చగొట్టి, మౌలిక వసతులను దెబ్బతీసేందుకే రష్యా ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. దాడుల కారణంగా నీప్రోపెట్రోవిస్‌్కలో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయని, కనీసం 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కీవ్ ప్రాంతంలోని బుచా, బొరిస్పిల్, ఒబుఖివ్‌లపై దాడులు జరిగాయి. ఒక ఇల్లు, కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. లివివ్ ప్రాంతంలో రెండు క్రూయిజ్ క్షిపణులను కూల్చివేశామని గవర్నర్ మాక్సిమ్ చెప్పారు. శత్రువు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో ఎఫ్–16 యుద్ధ విమానాలు కీలకంగా మారాయన్నారు. కాగా, దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న పోలెండ్ అప్రమత్తత ప్రకటించింది. పోలెండ్, నాటో యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో పహారాను ముమ్మరం చేశాయి. తమ గగనతలంలోకి రష్యా డ్రోన్ ప్రవేశించడంతో అడ్డుకునేందుకు రొమేనియా కూడా గత వారం ఎఫ్–16 జెట్లను పంపించింది.
ఎస్టోనియా గగనతలాన్ని అతిక్రమించలేదు: రష్యా
ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా శుక్రవారం రష్యాకు చెందిన మూడు యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించి, 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాయని నాటో సభ్యదేశం ఎస్టోనియా చేసిన ఆరోపణలను రష్యా ఖండించింది. ఎస్టోనియా సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో బాలి్టక్ సముద్రంపై ఉన్న తటస్థ జోన్‌లోనే తమ యుద్ధ విమానాలున్నాయని రష్యా రక్షణ శాఖ వివరించింది.