
అమెరికాకు వెళ్లకపోతే రష్యాకు మళ్లించవచ్చు
భారత్ మా నుంచి చమురు కొంటే తప్పేమిటి?
రష్యా దౌత్యవేత్త రొమన్ బాబుష్కిన్ వ్యాఖ్యలు
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్‌ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్‌కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.
భారత్‌కు 5 శాతం రహస్య తగ్గింపు
మరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్‌కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్‌లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్‌గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్‌లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్‌గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్‌కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు.