పేదల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి
దేశీయ కళలనూ ప్రోత్సహించిన మాజీ రాణి
బ్యాంకాక్: నిరాశ్రయులు, పేదల కష్టాలు పోగొట్టేందుకు రాజ కుటుంబం తరఫున శాయశక్తుల ప్రయత్నించిన థాయ్‌లాండ్ రాజమాత, గతంలో రాణిగా సేవలందించిన సిరికిత్ కితియకారా తుదిశ్వాస విడిచారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో అక్టోబర్ 17వ తేదీన 93 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని థాయ్ లాండ్ రాజకుటుంబ వర్గాలు ప్రకటించాయి.
హస్తకళలు సహా దేశవాళీ కళల పునరుజ్జీవానికి ఆమె తన వంతు కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. రాజకుటుంబం తరఫున చేపట్టే పలు ప్రాజెక్టులు ఈమె అజమాయిషీలోనే కొనసాగేవి. పదమూడేళ్ల క్రితం ఈమెకు పక్షవాతం రావడంతో అప్పట్నుంచి ఆరోగ్యం క్షీణించింది. ఆనాటి నుంచి బాహ్య ప్రపంచంలో కనిపించట్లేరు. ఆమె భర్త, రాజు భూమిబల్ అతుల్యతేజ్ 2016 అక్టోబర్‌లోనే పరమపదించారు.
రాజమాత సిరికిత్ కుమారుడు మహా వజ్రలాంగ్‌కోర్న్ ప్రస్తుతం థాయిలాండ రాజుగా సేవలందిస్తున్నారు. ‘‘తల్లిగారికి థాయ్‌లాండ్ ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత ఘనంగా అంత్యక్రియలు చేపడతాం. రాజకుటుంబం, రాజకుటుంబ సేవకులు సహా థాయ్‌లాండ్‌వాసులు ఏడాదిపాటు సంతాపకాలాన్ని పాటించనున్నారు’’అని రాజు ప్రకటించారు.
రాజమాత మరణవార్త తెలిసి వేలాది మంది అభిమానులు, పౌరులు శనివారం ఉదయమాన్నే ఛౌలాంగ్‌కార్న్ ఆస్పత్రి వద్ద గుమిగూడారు. ‘‘ఆమె లేని లోటు దేశంలో పూడ్చలేనిది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయపతాకాన్ని 30 రోజులపాటు అవనతం చేస్తాం. పౌర సేవకులు ఏడాదిపాటు సంతాప దినాలను పాటిస్తారు’’అని ప్రధానమంత్రి అనుతిన్ ఛార్న్‌విరాకుల్ ప్రకటించారు.
యువరాజును పెళ్లాడి..
ఫ్రాన్స్‌లో థాయ్‌లాండ్ రాయబారిగా పనిచేస్తు న్న నఖత్ర మంగళ, బువా కితియకారా దంపతులకు 1932 ఆగస్ట్ 12న సిరికిత్ జని్మంచారు. ఈమె తల్లిదండ్రులు గత ఛక్రి రాజ్యవంశానికి చెందిన వాళ్లు. యుద్దకాలంలో బ్యాంకాక్‌లో చదుకుని రెండో ప్రపంచయుద్ధసమయంలో తండ్రితో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అదే సమయంలో విద్యాభ్యాసం కోసం థాయ్‌లాండ్ యువరాజు భూమిబల్ పారిస్‌కు వచ్చారు. కారు ప్రమాదంలో ఆస్పత్రి పాలవ్వగా పరామర్శించేందుకు వెళ్లిన సిరికిత్ అతనితో ప్రేమలో పడింది. అప్పు డు ఆమె వయసు కేవలం 16 ఏళ్లు. 1950లో వీళ్ల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది.
పట్టుకు పట్టం
1970వ దశకంలో సిరికిత్, ఆమె భర్త భూమిబల్ దేశీయ సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. గ్రామాల్లో పేదరికాన్ని పారద్రోలడంతోపాటు గిరిజనులను ఓపియం మత్తుమందు జాడ్యం నుంచి బయటపడేసేందుకు రాణి సిరికిత్ ఎంతో కష్టపడ్డారు. అందుకోసం కొండకోనల్లో పేదల ఇళ్లకు స్వయంగా వెళ్లేవారు. దీంతో అంతా ఆమెను తమ కన్నబిడ్డగా చూసుకునేవారు. అత్యంత స్టైలిష్ వస్త్రధారణలో కనిపించే సిరికిత్ ఎప్పుడూ పేదల ఇళ్లకు వెళ్తూ అందరికీ దగ్గరయ్యారు.
ఇది కొందరు బ్యాంకాక్ సంపన్నులకు నచ్చలేదని గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976లో రాజరిక అభివృద్ధి ప్రాజెక్టులు మొదలుపెట్టగా వాటిని అమలు బాధ్యతల్ని ఈమె తీసుకున్నారు. పట్టు నేత, ఆభరణాల తయారీ, థాయ్‌లాండ్ సంప్రదాయ చిత్రలేఖనం, పింగాణీ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించారు. ఈ రంగాల్లో నైపుణ్యం సాధించేలా వేలాది మంది గిరిజనులకు తగు శిక్షణ ఇప్పించారు.
ఆమె పుట్టినరోజే మాతృ దినోత్సవం
సిరికిత్ పుట్టినరోజైన ఆగస్ట్ 12వ తేదీనే థాయ్‌లాండ్ వాసులు మాతృదినోత్సవం జరుపుకుంటారంటే ఆమెకు వాళ్లు ఎంతటి మహోన్నత గౌరవం ఇస్తారో ఇట్టే అర్థమవుతుంది. కాంబోడియా నుంచి వేలాదిగా వలసవచి్చన శరణార్థులను ఆమె ఆదరించి అక్కునచేర్చుకున్నారు. అడవుల నరికివేతను అడ్డుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. నిజానికి థాయ్‌లాండ్ దేశ రాజకీయాల్లో రాజకుటుంబం నేరుగా జోక్యంచేసుకోదు. రెండు సార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, చాలా రోజులు కొనసాగిన హింసాత్మక వీధి పోరాటాలు రాజకుటుంబం ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. అయితే 2008లో నిరసనకారుని అంత్యక్రియల్లో పాల్గొని రాజమాత తాము ప్రశ్నించదగ్గ ప్రజాస్వామ్య విధానాలకే కట్టుబడిఉంటామని పరోక్షంగా ప్రకటించారు.


