 
															టాంజానియాలోని అరుషాలో విధ్యంసం దృశ్యం
జనం నిరసనలు.. వీధుల్లోకి మిలటరీ
నైరోబి(కెన్యా): టాంజానియాలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. గురువారం రెండో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1961 నుంచి అధికారంలో ఉన్న చమా చా మపిండుజి(సీసీఎం) మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నేతల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
ఎన్నికల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత టుండు లిస్సును దేశద్రోహం నేరం కింద జైలులో పెట్టారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లుహా ఎంపినాను సైతం అనర్హుడిగా ప్రకటించారు. దీంతో, ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసన్‌తో ఎన్నికల బరిలో చిన్నాచితకా పార్టీలకు చెందిన 16 మంది పోటీ పడ్డారు. వీరెవరూ ప్రచారం కూడా చేయలేదు. బుధవారం పోలింగ్ జరిగింది.
జనం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కారులు ఒక బస్సుకు, గ్యాస్ స్టేషన్‌కు నిప్పంటించారు. పలు చోట్ల పోలీస్‌స్టేషన్లపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఘర్షణల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. దీంతో, ప్రభుత్వం బుధవారం సాయంత్రం వాణిజ్య రాజధాని దారెస్సలామ్‌లో కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ రాత్రి నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.
గురువారం ఉద్యోగులను ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరం కాని సిబ్బంది బయటకు రావద్దని సూచించింది. రహదారులపై ఆర్మీ అడ్డంకులను ఏర్పాటు చేసింది. సరైన పర్మిషన్లు లేని వారిని ఇళ్లకు పంపించి వేసింది. ప్రధాన ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను సైన్యం నిలువరించింది. కెన్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న మంగాంగా పట్టణంలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి.
వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. గురువారం వెలువడిన మొట్టమొదటి ఫలితాల్లో 272 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల 96.99 శాతం ఓట్లు అధ్యక్షుడు హసన్‌కే పడినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఫలితాలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్రంగా స్పందించింది. ‘టాంజానియాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. నిష్పాక్షికమూ కాదు’అంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల కోసం గట్టిగా నిలిచి పోరాడాలని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
