
పరస్పర విశ్వాసం, గౌరవంతో సరిహద్దు
సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం
ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్దాం
మన సహకారం ఇరుదేశాల 280 కోట్ల ప్రజల సంక్షేమంపై ఆధారపడింది
తియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని వ్యాఖ్య
భారత్, చైనా వాణిజ్యం సహా కీలక ద్వైపాక్షికాంశాలపై ఇరునేతల సుదీర్ఘ మంతనాలు
నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ విడిగా సమావేశంకానున్న మోదీ
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు.
‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి.
భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్‌పింగ్‌తో మోదీ అన్నారు.
భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్‌ల భారం మోపిన వేళ ఎస్‌సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్‌పార్టీ పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్‌క్వీని కలిశారు. జిన్‌పింగ్‌తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్‌క్వీని మోదీ కోరారు.
ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు
ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు.
వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్‌పింగ్‌ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్‌పింగ్
తియాంజిన్‌లో మోదీ, జిన్‌పింగ్ కరచాలనం ట్రంప్‌కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్‌ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి.
చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు.
దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్‌పింగ్ అన్నారు.
గ్రూప్ ఫొటోలో జిన్‌పింగ్, పుతిన్ పక్కపక్కనే
ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్‌పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్‌పింగ్‌కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు.
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్‌స్తాన్, కిర్‌గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్‌సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్‌సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్‌సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి.
జిన్‌పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం
రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్‌క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్‌పింగ్‌కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్‌పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్‌క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్‌ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట.
కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్‌లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్‌కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్‌లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్‌ప్లేట్‌ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు.
జిన్‌పింగ్ నోట పంచశీల మాట
భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్‌పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్‌పింగ్ అన్నారు.
ఏమిటీ పంచశీల ఒప్పందం?
1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి..
1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం
2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం
3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం
4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం
5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడం
ఆంక్షలపై పోరాడుతాం: పుతిన్
ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్‌సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్‌హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు.
మోదీ, జిన్‌పింగ్ భేటీ ‘పది’నిసలు
→ రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్‌పింగ్‌లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు
→ భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు
→ కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది
→ పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు
→ సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు
→ భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్‌పింగ్ అభిలషించారు
→ ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు
→ చైనా కంపెనీలకు భారత్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్‌లో విద్యుత్‌వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు
→ ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించారు
→ అధిక టారిఫ్‌లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.