టర్కీ, సిరియా భారీ భూకంపం.. గాఢనిద్రలోనే సమాధి.. తవ్వేకొద్దీ మృతదేహాలే!

Powerful Earthquake Hits Turkey Latest Updates - Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీ(తుర్కియే), సిరియా భూకంపం విపత్తు స్థితిని ఏర్పరిచింది. భారీ భూకంపం దాటికి 2600 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2200కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్‌లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ప్రజలు ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది.

స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో రెప్పపాటులో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకంగా.. కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమని టర్కీ నేషనల్‌ భూకంప కేంద్రం చీఫ్‌ రాయిద్‌ అహ్మద్‌ రేడియో ద్వారా ప్రకటించారు.

  

టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. సిరియాలో 300 మంది దాకా మృతి చెందినట్లు ఒక అనధికార ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో.. చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ ఝామున రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. ఆపై పావుగంటకు 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.  

తుర్కియే గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం..  తుర్కియేకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం కూడా. భూకంపం ప్రభావంతో.. లెబనాన్‌, ఈజిప్ట్‌, సైప్రస్‌లోనూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మృతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తుర్కియే(పూర్వపు టర్కీ).. తరచూ భూకంపాల భారీన పడుతుంది. 1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది దుర్మరణం పాలయ్యారు.

ఇక 2020 జనవరిలో ఎలజిగ్‌లో 40 మందిని, అదే ఏడాది అయిజీన్‌ సీప్రాంతంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని పొట్టబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకుండా.. అడ్డగోలుగా భవనాలు నిర్మించడమే అందుకు కారణమని అక్కడి నిపుణులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top