పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు, వాణిజ్యం, ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఈ భేటీ జరుగుతోంది. జీ7 సదస్సు-2026 ఫ్రాన్స్‌లోని ఎవియన్ స్పా పట్టణంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మోదీ, ట్రంప్ సమావేశయ్యారు.
నౌకా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..
ప్రపంచ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగడం, నౌకా సిబ్బంది భద్రతకు భరోసా ఉండడం అత్యంత ముఖ్యమని ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది భారతీయ నౌకా సిబ్బంది సముద్ర వాణిజ్యంలో పనిచేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ నిరంతరంగా సాగేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య నౌకా సిబ్బంది సంక్షేమం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని మోదీ అన్నారు. ఇరాన్‌కు సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. నౌకా కార్మికుల భద్రతతో పాటు ప్రపంచ నౌకాయాన మార్గాల నిర్వహణకు తగిన రక్షణ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వం అద్భుతం
“నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగినంత కాలం భారత్ ఎంతో బాగా పురోగమిస్తుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని “దేవదూత”గా ట‍్రంప్ అభివర్ణించారు. ‘‘ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. బేరసారాల్లో మోదీన నిక్కచ్చిగా ఉంటారు. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికా భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. తాను 8 యుద్ధాలకు ఆపానంటూ మరోసారి చెప్పారు. ఇరాన్ 48 ఏళ్లుగా ప్రపంచాన్ని ఉపయోగించుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, జీ7 సదస్సులో యూకే, అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల నాయకులు పాల్గొని ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణ, ఇతర కీలక అంశాలపై చర్చించారు. జీ7 దేశాలతో పాటు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ప్రతినిధులకు కూడా ఈ కీలక సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనను జీ7 దేశాలు స్వాగతించాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.


