ఆహారంలో బొద్దింకలు చూసి ఎంపీలు షాక్.. పార్లమెంటు హౌస్‌లో క్యాంటీన్లు సీజ్

Pakistan Parliament House Cockroaches Found In MPs Food - Sakshi

ఇస్లామాబాద్‌: పొరుగు దేశం పాకిస్తాన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దేశ పార్లమెంటు భవనంలో ఎంపీలు తినే ఆహారంలోనే బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీలు.. రెండు క్యాంటిన్ల  నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన ఇస్లామాబాద్ జిల్లా అధికారులు పార్లమెంటు హౌస్‌లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. మేనేజ్‌మెంట్‌ అస్సలు పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. కిచెన్‌లో ఆహారం పక్కన  బొద్దింకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే రెండు క్యాంటిన్లను సీజ్ చేశారు.

ఈ రెండు క్యాంటిన్లలో నిర్వహణ బాగాలేదని, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీలు ఆరోపించారు. భోజనం కూడా రుచిగా లేదని ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడమే మానేసినట్లు పేర్కొన్నారు.

పాక్ ఎంపీల ఆహారంలో బొద్దింకలు రావడం ఇది కొత్తేం కాదు. 2014లో సాస్‌ బాటిల్‌లోనూ బొద్దింకను చూసి ఓ ఎంపీ షాక్ అయ్యారు. అలాగే 2019లో ఇక్కడి క్యాంటిన్లలో ఆహారం బాగాలేదని, పరిశుభ్రత అసలు లేదని స్వయంగా ఎంపీలే నిరసనలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన దుస్థితి తలెత్తింది.
చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top