Rishi Sunak: ఒకవేళ ఓడిపోతే బ్రిటన్లో జాతివివక్ష ఉన్నట్లేనా? స్పందించిన రిషి సునాక్

Rishi Sunak Said Racism Not A Factor In Uk Prime Minister Race - Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షకు తావే లేదని  అభిప్రాయపడ్డారు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా లింగం, జాతిని చూసి ఓటు వేయరని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు సరైన అభ్యర్థి అని నిర్ణయించుకునేందుకు ఇది కారణంగా ఉండదన్నారు. ది డైలీ టెలిగ్రాఫ్‌కు ఆదివారం  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు తెలిపారు.

ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ఒకవేళ ఓడిపోతే బ్రిటన్‌లో జాతివివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్‌ గతవారం ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. రిషి దీనిపైనే స్పందిస్తూ.. అసలు జాతివివక్షకు  అవకాశమే లేదన్నారు.

రిచ్‌మాండ్ నుంచి టోరీ సభ్యులే తనను ఎంపీగా గెలిపించారని, ప్రధాని రేసులో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిలిచారని రిషి గుర్తు చేశారు. అలాంటప్పుడు జాతివివక్షకు ఆస్కారం ఎలా ఉంటుందన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులు అనే విషయం గురించి చర్చించే క్రమంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయన్నారు.

బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్‌, రిషి సునాక్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 1.75లక్షల మందికిపైగా టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని వీరిద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్‌ 5 వరకు ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

అయితే ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు ఎక్కువని తేలింది. 90 శాతం ఆమే గెలుస్తుందని, రిషి సునాక్‌కు 10శాతమే అవకాశాలున్నాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. రిషి కూడా తాను రేసులో వెనుకంజలో ఉన్నట్లు అంగీకరించారు. అయినా చివరి ఓటు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.
చదవండి: బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top