కుజునిపై జీవముండేదా?

NASA Curiosity Rover Finds an Ancient Oasis on Mars - Sakshi

ఉపరితలంపై పురాతన పగుళ్లు

భూమిపై జీవం పుట్టుకలో అవే కీలకం

కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు.

..ఎండా, వానా కాలాలు
కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్‌ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్‌ అభిప్రాయపడ్డారు.

మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్‌లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్‌ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్‌ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్‌ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్‌ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.

జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ  ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’    
– విలియం రేపిన్, పరిశోధన సారథి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top