క్రూజ్ షిప్‌లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు! | MV Hondius Cruise Outbreak Canada Confirms Hantavirus Case | Sakshi
Sakshi News home page

క్రూజ్ షిప్‌లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!

May 18 2026 9:09 AM | Updated on May 18 2026 9:19 AM

MV Hondius Cruise Outbreak Canada Confirms Hantavirus Case

ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్‌లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం  ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

కెనడాలో తొలి కేసు నమోదు
ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్‌లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

మనిషి నుంచి మనిషికి వ్యాప్తి
సాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్‌లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే  అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై  పర్యవేక్షణ చేపట్టాయి.

కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదు
క్రూజ్ షిప్‌లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు  చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!

Advertisement
 
Advertisement
Advertisement