పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు..

MONKEY LIVES FOR TWO YEARS WITH GENE HACKED PIG KIDNEY - Sakshi

మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్‌లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. 

మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్‌ సపోర్ట్‌ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్‌లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు.

జినోట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య  ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో  ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం  ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. 

అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్‌ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు.  ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్‌ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్‌ప్లాంట్‌ సహరిస్తుంది.

తాజా పరిశోధనలో జెనోట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్‌లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు.

మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

గతంలో జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్‌ పిగ్‌లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. 
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top