ఎప్‌స్టీన్‌తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ | Melania Trump Denies Epstein Links | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌తో లింకులు.. పెదవి విప్పిన అమెరికా ఫస్ట్ లేడీ

Apr 10 2026 7:45 AM | Updated on Apr 10 2026 10:10 AM

Melania Trump Denies Epstein Links

అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. జెఫ్రీ  ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న కథనాలు అబద్ధాలుగా ఆమె కొట్టిపారేశారు. మెలానియా తన పరువు తీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. అతని నేరాల గురించి కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కుట్రగా ఆమె అభివర్ణించారు.

ఎప్‌స్టీన్‌తో నన్ను ముడిపెడుతూ చేస్తోన్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను వ్యతిరేకించను. కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని నేను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌ నేరాల బాధిత మహిళలను బహిరంగ విచారణ నిర్వహించి.. వారు తమ  ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పే హక్కు ఉండాలి. అప్పుడు మాత్రమే వాస్తవం వెలుగులోకి వస్తుందని మెలానియా అన్నారు.

మోడల్‌గా ఉన్న మెలానియాను డొనాల్డ్‌ ట్రంప్‌నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్‌ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్‌ వోల్ఫ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్‌ను తొలిసారి న్యూయార్క్‌లోని కిట్‌కాట్‌ క్లబ్‌లో కలుసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరిన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో భాగంగా వీటిని బహిర్గతం చేసింది. ఎప్‌స్టీన్‌ ద్వారా ట్రంప్‌కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని తాజాగా ఆ పత్రాల్లో వెల్లడైంది. ఎప్‌స్టీన్‌ ఆ బాలికను న్యూయార్క్‌కి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడు.

ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతడ్ని గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు  పలు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆమె ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement