రక్షణ శాఖ​ మినిస్టర్‌గా ఆఫ్రికన్-అమెరికన్ నియమాకం

Joe Biden Chooses Llyod Austin as Defense Secretary - Sakshi

సెనేట్‌ అంగీకారంతో బాధ్యతలు స్వీకరించనున్న లాయిడ్‌ ఆస్టిన్‌

వాషింగ్టన్‌: నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్‌..‌ ట్రంప్‌ అధ్యక్ష కాలంలో ముదిరిన జాత్యాంహకార ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ని రక్షణ శాఖ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికన్‌ దళాలను పర్యవేక్షించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ని ఈ అత్యున్నత పదవికి బైడెన్‌ ఎన్నుకున్నారు. 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించి, యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతిగా ఎదిగారు లాయిడ్ ఆస్టిన్. తన కేబినెట్‌లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు పేర్కొన్నాయి. బైడెన్ శుక్రవారం ఆస్టిన్‌ నియామకం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్‌కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం.

ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు అమెరికా ఆర్మీకి సేవలు అందించారు. 2003లో 3వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు అసిస్టెంట్ డివిజన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్టిన్ ఇరాక్‌పై దాడిలో యూఎస్ సేనలను కువైట్ నుంచి బాగ్దాద్‌లోకి నడిపించారు. 2010లో ఇరాక్‌లోని అమెరికా దళాలకు కమాండింగ్ జనరల్‌గా నియమితులైన ఆస్టిన్.. రెండేళ్ల తర్వాత మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్‌లలో పెంటగాన్ కార్యకలాపాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. 2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్‌లో ఒకటైన రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరారు. (చదవండి: అమెరికా హెల్త్‌ సెక్రటరీగా హావియర్)

ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌కి, ఆస్టిన్‌ మధ్య మంచి సంబంధాలుండేవి. ఇక వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్‌ సోమవారం హెల్త్‌ సెక్టర్‌లోకి తాను తీసుకోబోతున్న ప్రముఖ వ్యక్తుల పేర్లు వెల్లడించారు. కరోనావైరస్పై యుద్ధంలో వీరు బైడెన్‌కు బాసటగా నిలవనున్నారు. 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top