ఇజ్రాయెల్, లెబనాన్‌ కాల్పుల విరమణ | Israel, Lebanon ceasefire agreement | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్, లెబనాన్‌ కాల్పుల విరమణ

Apr 17 2026 4:53 AM | Updated on Apr 17 2026 7:06 AM

Israel, Lebanon ceasefire agreement

పదిరోజులపాటు తాత్కాలిక  ఒప్పందం 

ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 

ఇప్పటికే 9 యుద్ధాలు ఆపానని, ఇది పదోదని ప్రకటన

కైరో/వాషింగ్టన్‌/దుబాయ్‌/ఇస్లామాబాద్‌: దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. పదిరోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ప్రకటించారు. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. 

దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్‌ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్‌ తన సొంత సామాజికమధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ప్రకటించారు. ‘‘లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌తో, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో ఇప్పుడు చక్కటి సంభాషణ పూర్తయింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఇద్దరూ అంగీకరించారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. 

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ డేన్‌ రెజీన్‌ కెయిన్‌లు ఇరుదేశాల నేతలను సమన్వయ పరుస్తూ శాశ్వత శాంతికి కృషిచేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్దాలను ఆపే అదృష్టం నాకు దక్కింది. ఇది పదోది. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించా’’అని ట్రంప్‌ ప్రకటించారు. 

ఆగని కాల్పులు! 
ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్‌ చెబుతుంటే మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్‌ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా మారాయి. గురువారం సైతం ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్‌ సరిహద్దులోని ప్రాంతాలపై హెజ్‌»ొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్‌లోని బీరూట్‌ సహా టైర్, నబాతేహ్, బిన్ట్‌ జబేయిల్‌లపై ఇజ్రాయెల్‌ దాడులను ఉధృతంచేసింది. 

ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా, ఇరాన్‌ ప్రతినిధుల మధ్య తొలి దఫా శాంతి చర్చలు విఫలంకావడంతో మరో దఫా చర్చలకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. పాక్‌ సాయుధబలగాల చీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌ గురువారం ఇరాన్‌లోని టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఘాలిబఫ్‌తో చర్చలు జరిపారు. 

ఈయన వెంట పాక్‌ అంతర్గత మంత్రి మొహ్‌సీన్‌ నఖ్వీ సైతం చర్చల్లో పాల్గొన్నారు. ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కారŠప్స్‌(ఐఆర్‌జీసీ) ప్రధానకార్యాలయం ‘ఖాతమ్‌ అల్‌–అన్బియా’ను మునీర్‌ బృందం వెళ్లి ఆర్మీ కమాండర్లతో కాల్పుల విరమణపై చర్చించారు. తర్వాత మునీర్‌ నేరుగా అమెరికా వెళ్లి ట్రంప్‌తో చర్చిస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు ఖతర్‌ ద్వారా మధ్యవర్తిత్వాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు పాక్‌ ప్రయతి్నస్తోంది. ఇందుకోస పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గురువారం ఖతర్‌కు వచ్చారు. 

10వేల సైన్యంతో దిగ్బంధం 
10వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్‌ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హారూŠమ్‌జ్‌ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’అని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ చైర్మన్‌ జనరల్‌ డేన్‌ కెయిన్‌ ప్రకటించారు.

 హార్మూజ్‌ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్‌ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్‌ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్‌ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement