
నగరంపై కరపత్రాలు కురిపించిన ఇజ్రాయెల్
సైనిక చర్య తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరికలు
గాజా సిటీ: హమాస్ శ్రేణులకు గట్టి పట్టున్న గాజా నగరంపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించేందుకు ప్రకటించిన ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ ముమ్మరం చేసింది. నగరవాసులు వెంటనే వెళ్లిపోవాలంటూ మంగళవారం పెద్ద సంఖ్యలో కరపత్రాలను విమానాల ద్వారా జారవిడిచింది. తమ బలగాలు నిర్ణయాత్మక శక్తితో రానున్నాయని హెచ్చరించింది. నగర వాసులు తీర ప్రాంతం వెంబడి, దక్షిణం వైపునకు వెళ్లాల్సిన మార్గం మ్యాప్ ఆ కరపత్రాల్లో ఉంది. ‘గాజా పాత నగరం, తుఫా మొదలుకొని పశ్చిమాన సముద్రం వరకు నివాసించే వారందరికీ ఇదే హెచ్చరిక.
ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్‌ను ఓడించాలని నిర్ణయించుకుంది. గాజా స్ట్రిప్ అంతటా చేపట్టిన విధంగానే గాజా నగరంలో ప్రచండ శక్తితో ఆర్మీ పనిచేస్తుంది’అని మిలటరీ ప్రతినిధి అవిచె అడ్రీ చెప్పారు. ‘మీ భద్రత కోసం గాజా నగరాన్ని ఖాళీ చేసి రషీద్ యాక్సిస్ మీదుగా అల్ మువాసిలో ఏర్పాటు చేసిన మానవతా జోన్‌లోకి వెంటనే వెళ్లిపోండి’అని ఆయన పాలస్తీనియన్లను కోరారు. ‘ఇది ప్రారంభం మాత్రమే. గాజా నగరంలో భూతల యుద్ధం తీవ్రరూపం దాల్చనుంది. వెంటనే నగరాన్ని వీడండి’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సైతం కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
నా మాటలను జాగ్రత్తగా ఆలకించండి... ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా’అని పేర్కొన్నారు. ఆయుధాలను వదిలేసి, బందీలందరినీ వదిలేసి హమాస్ లొంగిపోని పక్షంలో గాజాలో పెను తుఫాను బీభత్సం మొదలుకానుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఇటీవల తీవ్ర హెచ్చరికలు చేయడం తెల్సిందే. వచ్చే వారం పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పోరాటం మొదలుపెట్టేందుకు ఇజ్రాయెల్ వేలాదిగా బలగాలను రప్పిస్తోంది. గాజా నగరంలో 40 శాతం మేర ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చినట్లు ఆర్మీ అంటోంది.
హమాస్ నిఘా కోసం వాడుకుంటోందంటూ రెండు రోజుల్లో నగరంలోని కనీసం 50 బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ కూలి్చవేసింది. తాజాగా హెచ్చరికలతో మహిళలు, చిన్నారులతోపాటు చేతికందిన సామగ్రితో కూడిన కార్లు, ట్రక్కులు, వ్యాగన్ల వరుసలు దక్షిణ గాజా దిశగా సాగుతున్నాయని మీడియా పేర్కొంది.