గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరో వార్నింగ్‌..! | Iran warns Gulf hotels housing US troops | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరో వార్నింగ్‌..!

Mar 27 2026 3:41 PM | Updated on Mar 27 2026 3:53 PM

Iran warns Gulf hotels housing US troops

టెహ్రాన్‌: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా కాస్త విరామం ఇచ్చినా,  ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌ చమురు కేంద్రాలు, బాలిస్టిక్‌ క్షిపణి స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌  భీకర దాడులు చేస్తుంటే,  ఇరాన్‌ సైతం అంతే ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్‌లను పలు గల్ఫ్‌ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై దాడులకు దిగిన ఇరాన్‌.. మరోసారి వారిని హెచ్చరించింది. 

తమతో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, అవి  మానుకోవాలని సూచించింది. ఒకవేళ అలా కాకుండా తమపై దాడి చేసే వారికి మీ(గల్ఫ్‌ దేశాల్లోని) హోటళ్లలో  ఉండేందుకు అవకాశం కల్పిస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చింది. 

ఇరాన్‌పై దాడి చేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలా మంది అమెరికా సైనికులు, ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లి, దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు.  కాని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంచితే,. ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఇరాన్‌ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్‌ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.  అదే సమయంలో ఇరాన్‌ సైతం దాడులను తీవ్రతరం చేసింది.  ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్‌ వాయు రక్షణ దళం సమర్థవంతంగా అడ్డుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement