పాక్‌లో చర్చలు.. ప్రధానంగా అడ్డొచ్చే అంశాలివే.. | IRAN usa What is Pakistan's role How long will talks last | Sakshi
Sakshi News home page

పాక్‌లో చర్చలు.. ప్రధానంగా అడ్డొచ్చే అంశాలివే..

Apr 11 2026 3:51 PM | Updated on Apr 11 2026 4:44 PM

IRAN usa What is Pakistan's role How long will talks last

టెహ్రాన్‌: చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్‌ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా-ఇరాన్‌ ప్రతినిధులు మొదట విడివిడిగా కలుస్తున్నారు. ఇరాన్‌ ప్రతినిధులతో షెహబాజ్ షరీఫ్‌ సమావేశం ముగిసింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. జేడీ వాన్స్‌తో ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతికి దారి తీస్తాయని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

పాక్‌లో చర్చలు ఎంతకాలం కొనసాగుతాయి?
చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి. శనివారం సాయంత్రం వరకే జరిగే అవకాశం ఉంది.

ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..
అమెరికా-ఇరాన్‌ మధ‍్య చర్చల్లో ప్రధానంగా మూడు అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌ సేకరించిన యురేనియం, హార్మూజ్‌ జలసంధి, లెబనాన్‌ వంటి అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. హార్మూజ్‌ జలసంధిపై పట్టును నిలపుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులు ఆపాల్సిందేనని మొదటి నుంచి చెబుతోంది. ఇక యురేనియం నిల్వలపై ఇరాన్‌ వెనక్కి తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి.  

చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారు? 
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రత్యేక సలహాదారు జారెడ్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో కలిసి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల కోసం పాక్‌ చేరుకున్నారు.

పాకిస్థాన్ పాత్ర ఏంటి?
రెండు పక్షాలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతించారు. యుద్ధం వేళ కాల్పుల విరమణకు పాక్‌ కీలకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాక్‌ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మొదట ఇరు పక్షాల డిమాండ్లను షెహబాజ్‌ షరీఫ్‌ వింటున్నారు. ఆ తర్వాత ఆయన సమక్షంలో అమెరికా-ఇరాన్‌ ప్రతినిధులు చర్చించుకుంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement