ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు? | Iran Supreme Leader Mojtaba Khamenei is fine | Sakshi
Sakshi News home page

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు?

Apr 29 2026 12:07 AM | Updated on Apr 29 2026 12:58 AM

Iran Supreme Leader Mojtaba Khamenei is fine

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను భారత్‌లోని ఆయన ఉప ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయీనియా ఖండించారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.

“మా సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి దేవుని కృప వల్ల బాగుంది. కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి బాగుంది” అని జియాయీనియా తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వదంతులన్నీ నిజం కాదని పేర్కొన్నారు.

పశ్చిమాసియా ఘర్షణపై ఇరాన్ వైఖరిని మరోసారి చెబుతూ.. “యుద్ధం ప్రారంభం నుంచే మా దివంగత సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ అలీ ఖమేనీ చెప్పిన వాక్యాన్ని మేము చెబుతున్నాము. అమెరికన్లు, మా శత్రువులు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, కానీ ఈ యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాము’’ అని చెప్పారు.

గతవారం న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనపడలేదు. ఆ దాడులు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించిన భవన సముదాయంపై జరిగాయి. ఆ ఘటనలో ఆయన భార్య, కుమారుడు మరణించారు.

ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రధానంగా వైద్య సిబ్బంది మాత్రమే ఆయనను చూసుకుంటున్నారు. దాడుల్లో గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

పశ్చిమాసియా ఘర్షణ ముగింపుకు ప్రయత్నాలు, రష్యా, చైనా, భారత్ పాత్రపై జియాయీనియా స్పందిస్తూ.. “ప్రతి దేశం పాత్ర పోషించవచ్చు, అది సానుకూలం లేదా ప్రతికూల పాత్ర కూడా కావచ్చు” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్యాస్, చమురు ధరల గురించి ఆందోళన చెందుతున్నారని.. కానీ, ప్రాణాలు కోల్పోతున్న ప్రజల జీవన విలువ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదని అన్నారు.

ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, దేశంలో అంతర్గత ఉద్రిక్తతలపై వచ్చే నివేదికలు, సూచనలు ప్రభుత్వ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడదని, అది రిపబ్లిక్ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement