పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఇరాన్‌: ట్రంప్‌ | Iran has just informed us that they are in a State of Collapse | Sakshi
Sakshi News home page

పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఇరాన్‌: ట్రంప్‌

Apr 28 2026 11:05 PM | Updated on Apr 28 2026 11:28 PM

Iran has just informed us that they are in a State of Collapse

వాషింగ్టన్ డీసీ: ‘ఇరాన్ పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఉంది. ఈ విషయాన్ని ఇరాన్‌ మాకు తెలిపింది. ఇరాన్‌ తమ నాయకత్వ పరిస్థితిని సర్దుబాటు చేసుకునేందుకు వీలైనంత త్వరగా హార్మూజ్ జలసంధిని తెరవాలని కోరుతోంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం అన్నారు. 

ఇరాన్‌ అంతర్గత నాయకత్వ సంక్షోభం కారణంగానే ఆ వ్యూహాత్మక జలమార్గాన్ని తెరవాలని కోరుతోందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం సాగే కీలకమైన సముద్ర మార్గం హార్మూజ్ జలసంధి. దాని చుట్టూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంటో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం నెలకొన్న శత్రుత్వాన్ని ఆపే లక్ష్యంతో ఇరాన్‌ తాజాగా చేసిన దౌత్యపరమైన ప్రతిపాదనను తిరస్కరించడానికే తాను మొగ్గు చూపుతున్నట్లు ట్రంప్ అంతకుముందే సూచించారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని, అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చను ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో జరపాలని ఇరాన్‌ సూచించినట్లు సమాచారం.

తాజాగా జాతీయ భద్రతా అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలు సందేహాలను వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్‌లోని యురేనియం నిల్వల గురించి చర్చించకుండా కీలకమైన హార్మూజ్‌ జలమార్గాన్ని తిరిగి తెరిస్తే అమెరికా దౌత్యపరంగా విధిస్తున్న ఒత్తిడి ఇక ఉండదని పరిపాలనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. జలసంధి మూసివేత వల్ల పెరిగిన ఇంధన ధరలు అమెరికాలో ఇంధన ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉంది. అమెరికా తదుపరి వ్యూహంపై స్పష్టత రాలేదు.

ఇదే సమయంలో, కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి  వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనను ట్రంప్‌, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చిస్తున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement