పాకిస్తాన్‌లో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌

Iran conducts surgical strike inside Pakistan - Sakshi

ఉగ్రవాదుల చెర నుంచి ఇద్దరు ఇరాన్‌ గార్డులకు విముక్తి

టెహ్రాన్‌: పాకిస్తాన్‌ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినట్లు ఇరాన్‌ ఎలైట్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్‌ ఉల్‌–అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్‌ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్‌ అయిన జైష్‌ ఉల్‌–అదల్‌ 2018 అక్టోబర్‌ 16న 12 మంది ఐఆర్‌జీసీ గార్డులను అపహరించింది.

పాక్‌–ఇరాన్‌ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్‌జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఇరాన్‌ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్‌ ఉల్‌–అదల్‌ ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్‌ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top