భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్‌? కొండపై నుంచి కారును అమాంతం..

Indian Origin US Man Intentionally Drove Tried To Killed Wife And Kids - Sakshi

టెస్లా కారులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన కుటుంబం కాలిఫోర్నియాలోని పెద్ద కొండపై నుంచి పడిపోయింది. ఐతే ఈ ఘటనలో ఆ కుటుంబ సభ్యులంతా ప్రాణాలతో బతికి బట్టగట్టగలిగారు. ఈ ప్రమాదం శాన్‌ మాటియో కౌంటీలోని డెవిల్స్‌ స్లైడ్‌ వద్ద జరిగింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని నిర్థారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ..హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకున్న కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్‌ సిబ్బంది హెలికాప్టర్‌లతో అద్భుతంగా రెస్కూ ఆపరేషన్‌ చేపట్టి బాధితులను రక్షించింది.

ఐతే ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన హత్యా యత్నంగా అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు కుటుంబ యజమాని 41 ఏళ్ల ధర్మేష్‌ ఏ పటేల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయనున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు పేర్కొన్నారు. అదీగాక కారు కొండపై నుంచి ఇంత నిటారుగా పడిపోతే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అన్నారు. చాలా అరుదైన సమయాల్లోనే ఇలా జరుగుతుందని అన్నారు.

ఈ ప్రమాదంలో 4 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడికి చాలా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితులు దాదాపు 250 నుంచి 300 అడుగులు కొండ దిగువున పడిపోయినట్లు పేర్కొన్నారు. బహుశా కారు సీట్లు పిల్లలను కాపాడి ఉండవచ్చని భావించారు. సదరు వ్యక్తి పటేల్‌ తన భార్య పిల్లలను చంపేందుకు ఇలా హత్యయత్నానికి ఒడిగట్టాడేమో అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. అతను కోలుకున్న తర్వాత శాన్‌ మాటియో కౌంటీ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. 
(చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top