
వాషింగ్టన్: రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్‌పింగ్‌లతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. భారత్–అమెరికాల మధ్య భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుంటోందని వెల్లడించింది. ఇరుదేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, 21వ శతాబ్దంలో ఇది నిర్ణయాత్మక బంధమని ఉద్ఘాటించింది.
ప్రజలు, ప్రగతి అనే అంశాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయని స్పష్టం చేసింది. కీలక రంగాల్లో 2 దేశాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఇరుదేశాల ప్రజల నడుమ ఉన్న ఎడతెగని స్నేహబంధం మన ప్రయాణానికి ఇంధంగా పని చేస్తోందని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యను కూడా అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టుకు జతచేసింది.