కొనుగోళ్లను పూర్తిగా ఆపేస్తోందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు.
‘భారత్–పాక్ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్ తెలిపారు.


