స్వచ్ఛమైన వృద్ధి సాధిస్తాం!

India Sending Record Software Engineers To The World Narendra Modi - Sakshi

పర్యావరణ అనుకూల సాంకేతికతలతో అభివృద్ధి మార్గంలో..

భారత్‌లో పెట్టుబడులకు తరలిరండి

ప్రపంచ వాణిజ్య సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్‌ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్‌లో లైసెన్స్‌ రాజ్‌ నడిచేదని, కానీ తాము కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్‌) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు.

నవ భారత్‌ రికార్డులు
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉందని, ఒక్క డిసెంబర్‌లోనే భారత్‌లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్‌ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్‌ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్‌ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్‌ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top