థర్డ్‌ పార్టీ జోక్యాన్ని భారత్‌ ఒప్పుకోలేదు | India Refused US Mediation During Op Sindoor Pak Minister Exposes Trump | Sakshi
Sakshi News home page

థర్డ్‌ పార్టీ జోక్యాన్ని భారత్‌ ఒప్పుకోలేదు

Sep 17 2025 4:26 AM | Updated on Sep 17 2025 4:26 AM

India Refused US Mediation During Op Sindoor Pak Minister Exposes Trump

ద్వైపాక్షిక అంశమేనని తేల్చిచెప్పింది

కీలక అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం

మాతో చర్చలపై భారత్‌ స్పందించడం లేదు

పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ వెల్లడి

ట్రంప్‌ చెప్పింది అబద్ధమని పరోక్షంగా స్పష్టికరణ

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్‌ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. అంటే ట్రంప్‌ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు. తాజాగా అల్‌జజీరా మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

కీలకం అంశాలపై పొరుగుదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, తమతో చర్చలపై భారత్‌ స్పందించడం లేదని చెప్పారు. భారత్‌తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్‌ దార్‌ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని అన్నారు. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.

భారత్‌పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించానని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్‌ దార్‌ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్‌ పార్టీ జోక్యాన్ని భారత్‌ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించారు.

భారత్‌ను అడుక్కోలేం కదా!
‘‘కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా నుంచి మే 10వ తేదీన ఆఫర్‌ వచి్చంది. ఒక తటస్థ వేదికపై అతిత్వరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్‌లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్‌ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.

భారత్, పాక్‌ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్‌ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్‌ను అడుక్కోలేం కదా! శాంతిని కోరుకొనే దేశం పాకిస్తాన్‌. చర్చల ద్వారాపై సమస్యలు పరిష్కారం అవుతాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు రెండు దేశాలూ ముందుకు రావాలి. చర్చలకు భారత్‌ ఒప్పుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థికం, జమ్మూకశీ్మర్‌ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం. థర్డ్‌ పార్టీని అనుమతించాలని మేము కూడా పట్టుబట్టడం లేదు’’ అని ఇషాక్‌ దార్‌ సూచించారు.

ట్రంప్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన భారత్‌
ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌ ఉగ్రవాదుల భరతం పట్టడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆపరేషన్‌ ముగిసింది. భారత్‌పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ రెండు దేశాల ప్రభుత్వాల కంటే ముందే ట్రంప్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. దీనిపై విమర్శలు వచి్చనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.

భారత్, పాక్‌లపై వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆగేలా చేశానని, ఆ క్రెడిట్‌ తనకే దక్కాలని, అంతేకాకుండా నోబెల్‌ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్‌ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై భారత్‌ స్పందిస్తూ ట్రంప్‌ వాదనను పలుమార్లు తిప్పికొట్టింది. రెండు దేశాలతో సంబంధం లేని మూడో వ్యక్తి చెబితే కాల్పుల విరమణకు తామెందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశామని స్పష్టంచేసింది. నోబెల్‌ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని ట్రంప్‌ విజ్ఞప్తి చేయగా, భారత్‌ నిర్మొహమాటంగా తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement