USA: ఆర్‌ఎంపీలకు ఆన్‌లైన్‌ శిక్షణ

India Origin Doctors And Professionals Launch Project Madad For RMPs - Sakshi

అమెరికా నుంచి సేవలందిస్తున్న వైద్యులు, వృత్తి నిపుణులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 150 మందికి శిక్షణ 

న్యూయార్క్‌: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులకు తమ వంతు సేవలందించేందుకు అమెరికాలోని వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొస్తున్నారు. వారంతా బృందంగా ఏర్పడ్డారు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వారితో పాటు భారత్‌లోని వృత్తి నిపుణులు కూడా ఈ 27 మంది బృందంలో ఉన్నారు. తమ సేవా కార్యక్రమానికి ప్రాజెక్ట్‌ మదద్‌ అని పేరు పెట్టుకున్నారు. కరోనా పరీక్షలు, చికిత్సా విధానాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్లకు (ఆర్‌ఎంపీ), ఆరోగ్య కార్యకర్తలకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు.

ఆసుపత్రుల్లో పడకల లభ్యతపై సమాచారం అందజేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవాలకు ప్రజలకు తెలియజేస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఆర్‌ఎంపీలకు, హెల్త్‌కేర్‌ వర్కర్లకు సరైన శిక్షణ ఇవ్వడమే ప్రాజెక్టు మదద్‌ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఇప్పటికే 150 మందికిపైగా ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇచ్చామని, వారితో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌–19 లక్షణాలను గుర్తించడం, తక్కువ తీవ్రత కలిగిన వారికి ఇళ్లల్లోనే చికిత్స అందించడం, వ్యాక్సినేషన్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలన్న ఆలోచన ఉందన్నారు. గ్రామాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా చికిత్సపై సరైన పరిజ్ఞానం లేనట్లు గుర్తించామని, అందుకే ప్రాజెక్టు మదద్‌కు శ్రీకారం చుట్టామని ప్రాజెక్టు లీడ్, న్యూయార్క్‌కు చెందిన రాజా కార్తికేయ తెలిపారు. ఆర్‌ఎంపీలకు తగిన శిక్షణ ఇస్తే కరోనా చికిత్స చాలావరకు తేలికవుతుందని, ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని అమెరికాలోని మినియాపొలిస్‌కు చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్‌ రేడియాలజీ స్పెషలిస్టు డాక్టర్‌ సుబ్బారావు ఇనంపూడి తెలిపారు. తమ ప్రాజెక్టుతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని, తాము శిక్షణ ఇచ్చిన ఆర్‌ఎంపీలు, వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని యూఏఈలో చార్టర్డ్‌ అకౌంటెన్సీ సంస్థను నిర్వహించే బలరాంరెడ్డి పేర్కొన్నారు.

(చదవండి: తెగిపడిన కేబుల్‌ కారు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top