
న్యూఢిల్లీ: భారత్- చైనా దేశాలు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు తదుపరి చేపట్టాల్సిన చర్యలకు ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ)సమావేశంలో ఇరుపక్షాలు ఈ అంశాలపై చర్చలు జరిపాయి.
సరిహద్దుల్లో ప్రశాంతత, సాధారణ పరిస్థితి నెలకొనడం, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్) తదుపరి దశ చర్చలకు భారత్- చైనా సిద్ధమయ్యాయని ఎంఈఏ పేర్కొంది. ఈ చర్చలకు భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వం వహించనున్నారు.
ఈ చర్చలకు ముందు వాంగ్ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గడచిన తొమ్మిది నెలలుగా భారత్- చైనాలు ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి 60 వేల మంది సైనికులున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు జరిగాయి.
2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్ 21న ఖరారైన ఒప్పందం ప్రకారం డెమ్‌చోక్, డెప్సాంగ్ పాయింట్ల నుండి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాల దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.