పాక్‌ను టిష్యూ పేపర్‌లా చూస్తున్నారు.. భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు

Imran Khan Says Pak Like Tissue No Superpower Dictate India - Sakshi

పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా నేషనల్‌ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు సిద్ధమయ్యాడు ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌. అయితే దానికంటే ముందు జాతిని ఉద్దేశించి ప్రసగించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. పాక్‌ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.  

పాక్‌ ప్రధాని శుక్రవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. తనను గద్దె దించడం వెనుక విదేశీ హస్తం ఉందన్న మాటే మరోమారు హైలైట్‌ చేసిన ఆయన.. పనిలో పనిగా మరోసారి భారత్‌పై ప్రశంసలు గుప్పించడం విశేషం. 

సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని  డిప్యూటీ స్పీకర్‌ దర్యాప్తులో గుర్తించారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం చెల్లదని ప్రకటించారు. అలాంటిది.. సుప్రీం కోర్టు కనీసం విచారణ చేపట్టినా బాగుండేది. ప్రాణ హాని ఉందన్న లేఖను సైతం కోర్టు పట్టించుకోలేదు. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తాం. అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడి నేతల్ని కొందరిని కలిసిన తర్వాతే.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెర లేచింది. ప్రజాప్రతినిధులు గొర్రెల్లా అమ్ముడుపోయారు. ఇక్కడి మీడియా కూడా ప్రభుత్వం కుప్పకూలుతుంటే.. సిగ్గు లేకుండా సంబురాలు చేసుకుంటోంది. 

ఆత్మ గౌరవం విషయంలో పాక్‌.. భారత్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడి ప్రజలు తమ దేశాన్ని గర్వంగా భావిస్తుంటారు. అందుకు కారణం.. ఏ మహాశక్తివంతమైన దేశాలు కూడా వాళ్లను శాసించలేవు కాబట్టి. వాళ్ల విధానాలు వాళ్లకు ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదు. కానీ, మనం(పాక్‌ను ఉద్దేశించి) ఎందుకూ పనికిరాం. పాక్‌ను ఓ టిష్యూ పేపర్‌లాగా తీసి పారేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో.. ఆ శక్తివంతమైన దేశానికి లొంగి ఉంటారే లేదో బేరీజు వేసుకున్నాకే.. సరైన వాళ్లను ఎంచుకోండి. బానిసల్లాగా బతకాలనుకుంటున్నారా? లేదంటే ప్రజాస్వామ్యయుత దేశంలో జీవించాలనుకుంటున్నారా? ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఇక మీదే(పాక్‌ పౌరుల్ని ఉద్దేశించి).

మీ దేశ సౌభ్రాతృత్వం ఇక మీ చేతుల్లోనే ఉంది. దానిని రక్షించాల్సిన బాధ్యత మీకే ఉంది. బయటకు రండి.. నిరసన తెలియజేయండి.. మీ స్వాతంత్ర్యాన్ని(ఆజాదీ)ని మీరే రక్షించుకోండి అంటూ ప్రసగించాడు ఇమ్రాన్‌ ఖాన్‌.

చదవండి: పాక్‌ గడ్డపై మళ్లీ నవాజ్‌ షరీఫ్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top