ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్‌ ఖాన్‌ | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్‌ ఖాన్‌

Published Sat, Apr 15 2023 9:24 PM

Imran Khan Said Army Chief Is The Most Powerful Person In Pakistan - Sakshi

పాకిస్తాన్‌ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్‌ జమాన్‌ పార్క్‌ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్‌లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్‌లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు.

మే 14న పంజాబ్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్‌ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్‌ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి.

ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్‌ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్‌. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ ముస్లీం లీగ్‌ నవాజ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం.

(చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement