జెరూసలేం: హెజ్‌బొల్లా(Hezbollah),హమాస్‌లపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థల అగ్రనేతలను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఈక్రమంలోనే హెజ్‌బొల్లాకు చెందిన రద్వాన్ ఫోర్స్‌పై ఐడీఎఫ్ దాడికి దిగింది. ఈ దాడిలో రద్వాన్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు హెజ్‌బొల్లాకు ఆయుధాల సరఫరా, ఉగ్రవాద మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఈ దాడి శనివారం రాత్రి రమాన్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఉత్తర కమాండ్ ఆధ్వర్యంలో వైమానిక దళాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. రద్వాన్ ఫోర్స్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఐడీఎఫ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలాంట్ (Yoav Gallant) స్పందించారు.
హెజ్‌బొల్లా నిప్పుతో చెలగాటం ఆడుతోంది. వారు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. గత ఒప్పందం ప్రకారం, కాల్పుల విరమణ జరగాలి. హెజ్‌బొల్లా తన ఆయుధాలను సమర్పించి, దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని లెబనాన్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ సంస్థ అలాచేయడం లేదు. కాల్పులకు తెగబడుతోంది. దీనికి ప్రతిగా మేము మా దాడులను కొనసాగిస్తాం. అవసరమైతే మరింత ముమ్మరంగా స్పందిస్తాం. ఇజ్రాయెల్ తన భద్రతా చర్యలను గరిష్ట స్థాయిలో కొనసాగిస్తుంది. ఉత్తర ప్రాంత నివాసితులకు ముప్పు కలిగించే ప్రయత్నాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము’ అని ఆయన హెచ్చరించారు


