
హమాస్ అప్పగించిన మహిళ మృతదేహంపై ఇజ్రాయెల్ ఆరోపణ
షిరి బిబాస్ సహా బందీలందరినీ విడుదల చేయాలని డిమాండ్
టెల్‌అవీవ్: హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం.. 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో పట్టుబడిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్, అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది. మహిళ మృతదేహం అపహరణకు గురైన ఇతర వ్యక్తులతో సరిపోలడం లేదని సైనిక ప్రతినిధి తెలిపారు. అంతేకాదు.. కఫీర్ బిబాస్, ఏరియల్ బిబాస్‌లను హమాస్ చంపిందని ఆరోపించారు.
బందీల విడుదల ఒప్పందంలో హమాస్‌ది తీవ్రమైన ఉల్లంఘనని ఇజ్రాయెల్ మండిపడింది. షిరితో పాటు మిగిలిన బందీలందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలపై హమాస్ ఇంకా స్పందించలేదు. కాగా, గురువారం మృతదేహాల అప్పగింత సమయంలో జరిగిన హడావుడిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. విడుదల సందర్భంగా వేలాది మంది జనం మధ్య.. సాయుధ హమాస్ ఫైటర్లు నాలుగు శవపేటికలను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు.