
హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో నష్టం
లక్ష డాలర్లు అంటే వార్షిక వేతనం కంటే ఎక్కువే
అమెరికాలో భారతీయులకు తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు
హఠాత్తుగా ఆగిపోయిన స్వదేశీ ప్రయాణాలు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారతీయ టెక్నాలజీ ఉద్యోగులకు శరాఘాతమేనని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు. అత్యంత ప్రతిభావంతులపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వారి సేవలు తప్పనిసరిగా అవసరమని అమెరికా కంపెనీలు భావిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడొచ్చు. ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను అధ్యక్షుడు ట్రంఫ్ పాటిస్తున్నారు. అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు.
వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని ‘ప్రాజెక్టు ఫైర్‌వాల్’గా అమెరికా కార్మిక శాఖ అభివర్ణించింది. అమెరికన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు రక్షణఛత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీసా ఫీజు లక్ష డాలర్లుఅంటే అది సాధారణ హెచ్–1బీ ఉద్యోగ వార్షిక వేతనంతో సమానం, కొందరి విషయంలో అంతకంటే ఎక్కువే కావడం గమనార్హం. వీసా కోసమే ఏటా లక్ష డాలర్లు చెల్లించి భారతీయులను నియమించుకోవడం చాలా కంపెనీలకు తలకు మించిన భారమే. 2023లో 1.91 లక్షల మంది, 2024లో 2.07 లక్షల మంది భారతీయులు హెచ్–1బీ వీసాలు పొందారు.
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర భారతీయ ఐటీ కంపెనీలు జూనియర్ లేదా మిడ్–లెవెల్ ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపించకపోవచ్చు. మరోవైపు వీసా రుసుము పెంపు వల్ల విదేశీ ఉద్యోగుల కంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమ ప్రధానంగా విదేశీయులపై ఆధారపడుతోంది. వారి రాకను అడ్డుకుంటే నవీన ఆవిష్కరణలు, ప్రగతికి ఆటంకం కలగొచ్చు. అంతిమంగా అమెరికాకే నష్టం జరుగుతుంది.
అది తెలివైన నిర్ణయం కాదు
భారతీయులను లక్ష్యంగా చేసుకోవడాన్ని కాటో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డేవిడ్ బియర్ తప్పుపట్టారు. ఇండియన్ హెచ్–1బీ వీసాదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని తెలిపారు. వారు పన్నుల రూపంలో ప్రతిఏటా బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. శాంతి కాముకులు, కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు, చట్టాలను చక్కగా గౌరవించే భారతీయులను దూరం పెట్టడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. మొత్తం అమెరికాకే వన్నె తెస్తున్న భారతీయులను బయటకు పంపించాలని అనుకోవడం తెలివైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేవలం భారత్‌లో జన్మించారన్న కారణంతో వివక్ష చూపడం, వారి సేవలు వదులుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ మేరకు డేవిడ్ బియర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
భారత్‌కు ప్రయాణాలు బంద్
హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల వార్షిక రుసుమును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అమెరికాలోని భారతీయులు ఆందోళనకు గురయ్యారు. స్వదేశానికి పయనమైన చాలామంది హఠాత్తుగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. పండుగలు, బంధుమిత్రుల వివాహాల కోసం భారత్‌కు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. విమానాలు ఎక్కాల్సిన వారు కూడా వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఇండియాకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో కనిపించింది. త్వరలో జరగాల్సిన ప్రయాణాలను సైతం కొందరు రద్దు చేసుకున్నారు. అమెరికాలోని భారతీయుడికి పెళ్లి కుదిరింది. త్వరలో భారత్‌లోనే పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడు ట్రంప్ ప్రకటన తెలిసి ఏం చేయాలో అర్థంకాక వెనక్కి మళ్లాడు.
అంటే అతడి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే ఇండియాలో ఉన్న హెచ్–1బీ వీసాదా రుల్లో సందిగ్ధత నెలకొంది. పెరిగిన వీసా రుసుములు చెల్లించాలా లేదా అని ఆరా తీస్తూ కనిపించారు. అమెరికాలోని టెక్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పట్లో స్వదేశాలకు వెళ్లే ఆలోచన చేయొద్దని, అమెరికాలోనే ఉండిపోవాలని సూచించాయి. బయట ఉన్నవారు వెంటనే రావాలని ఆదేశించాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు రావడం భారతీయు లను నిరాశకు గురిచేసింది.
ఇండియాలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలని ఆశించామని, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నామని, ట్రంప్ ప్రకటనతో తమ ఆనందం ఆవిరైపోయిందని ఓ భారతీయుడు ఆవేదన వ్యక్తంచేశాడు. చాలామంది తమ మనసులోని బాధను సోషల్ మీడియా పోస్టుల్లో వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారతీయుల్లోనూ ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు హెచ్–1బీ వీసాల ఫీజులు పెంచేశారని, ఇతర వీసాలను ట్రంప్ వదిలిపెట్టబోడని వారు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ నిర్ణయాలను కోర్టులు నిలిపివేయొచ్చని మరికొందరు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
అధ్యయనం చేస్తున్నాం: రణధీర్ జైశ్వాల్
హెచ్–1బీ వీసా ఫీజు పెంపుతో భారతీయ కుటుంబాల్లో కొన్ని పర్యవసానాలు తలెత్తే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. వీసా ఫీజు పెంపు వల్ల ఏర్పడే పరిణామాలపై భాగస్వామ్య పక్షాలతో కలిసి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులు ఇక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందన్నారు. భారతీయ స్కిల్డ్ వర్కర్లతో అమెరికా లబ్ధి పొందుతోందని గుర్తుచేశారు. భారత్, అమెరికాల మధ్య ప్రతిభావంతుల బదిలీ అనేది సహజంగా జరుగుతోందని వివరించారు. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు.