Viral Video: విమానంలో చిన్ననాటి టీచర్‌ చూసి...పట్టరాని ఆనందంలో ఫ్లైట్‌ అటెండెంట్‌...

Flight Attendant Meets Her Favourite Teacher On Airplane Goes Viral - Sakshi

విద్యార్థి జీవితంలో టీచర్లు చాల కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు బోధనతో మన జీవితాలపై చెరగని ముద్ర వేస్తారు. మనం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన చిన్ననాటి ఉపాధ్యాయులను కలవడం అత్యంత అరుదు. అదీగాక బిజీ లైఫ్‌, పలు పనుల ఒత్తిడితో కలిసే అవకాశం రాకపోవచ్చు. అనుకోకుండా మన చిన్ననాటి స్కూల్‌ టీచర్‌ ఎదురుపడితే ఎవ్వరైనా మాటల్లో చెప్పలేనంత ఆనందం తోపాటు ఒక విధమైన భావోద్వేగానికి గురవుతాం. అచ్చం అలానే ఇక్కడొక ఫ్లైట్‌ అటెండెంట్‌ ఆ విధమైన గొప్ప అనుభూతిని పొందింది.

వివరాల్లోకెళ్తే...కెనడాలోని జెట్‌ సీఎస్‌ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్‌ అటెండెంట్‌ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూస్తుంది. దీంతో పట్టరాని ఆనందంతో విమానంలోని మైక్రోఫోన్‌తో ప్రయాణికులను చూస్తూ మాట్లాడుతుంది. ఈ మేరకు ఫ్లైట్‌ అటెండెంట్‌ భావోద్వేగంగా మాట్లాడుతూ...."ఈ విమానంలో నా చిన్ననాటి ఉపాధ్యాయురాలు ఉంది. ఆమెను 1990 తర్వాత చూసిందే లేదు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను ఇప్పుడే చూడటం.  ఆమె నన్ను షేక్స్‌పియర్‌ని ప్రేమించేలా చేసింది. పియానో వాయించేలా చేసింది.

అంతేకాదు పియానాలో మాస్టర్స్‌ చేశాను. ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు ఓకానెల్‌ అంటూ తన గురువు పేరుని చెబుతుంది." అంతేగాదు చిన్నపిల్లలా ఆనందంతో పరుగెత్తుకుంటూ తన టీచర్‌ వద్దకు వెళ్తుంది. ఈ ఘటన అనుహ్యంగా ఇంటర్నేషనల్‌ టీచర్స్‌ డే రోజున జరగడం విశేషం. ఈ క్రమంలో సదరు ఎయిర్‌వేస్‌ కూడా ఇది చాల అద్భుతమైన క్షణం, టీచర్స్‌ డే రోజునే దీన్ని మాతో పంచుకున్నందుకు లోరీకి ఆమె టీచర్‌కి ధన్యావాదాలు అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుడు కియోనా థ్రాషెర్‌ పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మిరాకిల్‌ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top