
వరుణుడు పగబట్టాడేమో అనేంతగా చైనా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కిందటి నెలలో ఉత్తర బీజింగ్‌లో కురిసిన భారీ వర్షాలకు 44 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా.. మెరుపు వరదలు పోటెత్తి పది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చైనా గాన్సు ప్రావిన్స్‌లో శుక్రవారం ఇది చోటు చేసుకుంది.
చైనాలో శుక్రవారం ఘోరం జరిగింది. మెరుపు వరదలు పోటెత్తడంతో పది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో జనాల ఆచూకీ లేకుండా పోయింది. దీంతో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నిరకాల మార్గాలతో సహయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
గురువారం గాన్సు ప్రావిన్స్‌లోని యూజోంగ్‌లో కుంభవృష్టి కురిసింది. ఫలితంగా శుక్రవారం వేకువ జామునే మెరుపు వరదలు పోటెత్తాయి. వరదల ఉధృతికి లాంజౌ నగర శివారులో కొండ చరియలు విరిగిపడినట్లు అక్కడి మీడియా సంస్థ సీసీటీవీ కథనాలు ఇస్తోంది. జింగ్‌లాంగ్ పర్వత శ్రేణి గుండా నాలుగు గ్రామాలకు కరెంట్, సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి.
చైనాలో సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు దాకా వానలు కురుస్తుంటాయి. ఈ కాలంలో దక్షిణ, తూర్పు ప్రాంతాలు మాన్‌సూన్ ప్రభావానికి లోనవుతాయి. తద్వారా భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. ఈసారి గాలి ప్రవాహ మార్పులు అంటే.. పశ్చిమ గాలులు, సముద్రపు తేమ గల గాలులు ఒకే ప్రాంతంలో కలుస్తుండడం వల్ల వర్షాలు అధికంగా పడుతున్నాయి.
గ్వాంగ్‌డాంగ్, గుయాంగ్సీ, హునాన్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయికి మించి ఉంది.
చైనా భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు తీవ్ర స్థాయిలో ప్రజల జీవితం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. వరదల వల్ల చైనాకు ఇప్పటిదాకా 54.11 బిలియన్ యువాన్ (ఆరున్నర లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల వల్ల సుమారు 80 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌజ్ ఉద్గారాలను వదిలే దేశంగా చైనా ఉంది. ఫలితంగా అక్కడి వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది విశ్లేషకుల మాట. అదే సమయంలో.. చైనా ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగంలో శక్తివంతమైన దేశంగానూ నిలవడం గమనార్హం. ఈ క్రమంలోనే 2060 నాటికి కార్బన్-న్యూట్రల్ (కార్బన్ ఉద్గారాలు లేకుండా) చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.